బీమా లేని ఆర్టీసీ.. ప్యాసింజర్లు, డ్రైవర్లకే నష్టం

బీమా లేని ఆర్టీసీ.. ప్యాసింజర్లు, డ్రైవర్లకే నష్టం

ప్రమాద సమయాల్లో కంటితుడుపుగా పరిహారం అందిస్తున్న సంస్థ

అద్దె బస్సులకు చెల్లించి, సొంత బస్సులకు విస్మరిస్తోంది

రైళ్లలో అమలు చేసినట్టు టికెట్​పై చార్జి తీసుకోవాలి

డిమాండ్​ చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు

హైదరాబాద్, వెలుగు : సిటీలో అతిపెద్ద ప్రజా రవాణ వ్యవస్థ అయిన ఆర్టీసీ ఇన్సూరెన్స్‌ కట్టడం లేదు. అద్దె బస్సులకు మాత్రం బీమా కడుతూ సొంత బస్సులను విస్మరిస్తోంది. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు, సిబ్బందితోపాటు సంస్థ కూడా నష్టపోతోంది. ఏటా వివిధ ప్రమాదాల కేసుల్లో గరిష్టంగా రూ.20 కోట్ల దాకా పరిహారం చెల్లిస్తోంది. గత ఏడాది గ్రేటర్​లో జరిగిన బస్సు ప్రమాదాల్లో 30 మంది, ఈ ఏడాది 25 మంది చనిపోయారు. వారిలో కొందరికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల దాకా పరిహారం అందించింది. ఇంకా అందని వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. టోల్‌ట్యాక్స్, సెస్, రవాణా చార్జీలు మినహా టికెట్లపై బీమా చార్జీలు వసూలు చేయడం లేదు. రైల్వే మాత్రం ప్రైవేటు ఫైనాన్స్​సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆన్​లైన్​ టికెట్​పై 0.49 పైసలు తీసుకుని ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేస్తోంది. ఇట్లానే ఆర్టీసీలోనూ టికెట్​పై చార్జి చేసి బీమా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్​చేస్తున్నాయి.

ఆర్టీసీ బస్సుల్లో ప్రమాద బీమా లేకపోవడంతో అటు బాధితులు, ఇటు డ్రైవర్ల పాలిట శాపంగా మారుతోంది. బస్సు ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాల వారికి అంతులేని ఆవేదన మిగుల్చుతుంది. ఏదైనా ప్రమాదం లో మృతి చెందిన వారిని తిరిగి తీసుకురాలేము. కానీ వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు వాహనం బీమా ఉంటే మేలు జరుగుతుంది. ఆర్టీసీ మాత్రం ఈ విషయంలో మాత్రం ఇన్సూరెన్స్ మినహాయింపు పొందింది. ఆర్టీసీ బస్సు ప్రమాదాల కారణంగా ఎవరైనా చనిపోతే సంస్థ తరఫున పరిహారం ఇస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులకు ఇన్సూరెన్స్ లేకపోయిన నెట్టుకొస్తున్నారు. ఐతే ఇది అటు ఆర్టీసీకి గానీ, డ్రైవర్లకు గానీ, బాధితులకు గానీ ఏ విధంగానూ మేలు చేయడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు మిగిల్చుకోవాలని ఆర్టీసీ భావిస్తున్నప్పటికీ ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారికి ఏటా చెల్లిస్తున్న పరిహారం ఇంచుమించుగా ఇన్సూరెన్స్ చెల్లిస్తే అయ్యే ఖర్చులో సగం వరకు అవుతోంది. ఒక్క ఏడాదిలో పరిహారాల కిందే ఆర్టీసీ రూ.20 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఇదే డబ్బును ఇన్సూరెన్స్ కోసం చెల్లిస్తే పరిహారాలు చెల్లించకపోగా ప్రయాణికులకు భరోసా ఉంటుంది.

బాధితులకు అన్యాయం

ఇన్సూరెన్స్ లేకపోవడమనేది అటు బాధిత కుటుంబాలకు ఇబ్బందిగానే మారింది. ఆర్టీసీ బస్సు ప్రమాదం కారణంగా చనిపోతే పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు కోర్టు చుట్టు తిరగాల్సి ఉంటోంది. ఈ పరిహారం ఎంత అన్నది చనిపోయిన వ్యక్తిని బట్టి కేసును వాదించే లాయర్ ను బట్టి ఉంటోంది. ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా పరిహారం అందుతోంది.

డ్రైవర్లకు ఇబ్బందే

ఇన్సూరెన్స్ లేకపోవడమనేది ప్రధానంగా ఆర్టీసీ డ్రైవర్లకు సమస్యగా మారుతోంది. ఏదైనా ఇతర వాహనాలకు ఆర్టీసీ బస్సు ఢీకొట్టినప్పుడు అవతల వ్యక్తి డిమాండ్ చేసినంతా డ్రైవర్లే చెల్లించుకోవాల్సి వస్తోంది. పైగా ఆర్టీసీ బస్సు డ్యామేజ్ అయితే దానికి రిపేర్ కు సంబంధించి డబ్బులను డ్రైవర్ల నుంచే రికవరీ చేస్తున్నారు. బస్సుకు చిన్న డ్యామేజ్ అయిన లక్షల్లో పరిహారం కట్టాల్సి రావడంతో డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్లు కావాలని చేయరని దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ జీవితం పూర్తిగా నష్టపోవాల్సి ఉంటోంది. పైగా  ఆన్ డ్యూటీలో ఉన్న డ్రైవర్లు, గానీ కండక్టర్లు గానీ చనిపోతే ఇన్సూరెన్స్ లేని కారణంగా వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదు. ఆర్టీసీలో అద్దెకు నడుపుతున్న బస్సులకు మాత్రం ఆర్టీసీ అధికారులే ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 2 వేల వరకు ఆర్టీసీ అద్దె బస్సులున్నాయి. ఏటా కొత్త బస్సులకు 90 వేలు, పాత బస్సులకు 70 వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఆర్టీసీ చెల్లిస్తోంది.

రైల్వే, విమాన సంస్థలో  టిక్కెట్ తోనే ఇన్సూరెన్స్

ఆర్టీసీ లో అటు బస్సులకు ఇటు ప్రయాణికులకు ఇన్సూరెన్స్ లేదు. కానీ రైల్వే, విమాన ప్రయాణికులకు మాత్రం టిక్కెట్ తీసుకునే సందర్భంలోనే ఇన్సూరెన్స్ కోసం ఛార్జ్ చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులు ఐఆర్టీసీ నుంచి టిక్కెట్ బుక్ చేసుకుంటే ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఇక విమాన సంస్థలో సైతం 800 నుంచి 1500 వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. దీని కారణంగా రైల్వేలో, విమానాల్లో ప్రయాణించే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రమాద బీమా అందుతుంది.

డ్రైవర్లు నష్టపోతున్నరు

ఆర్టీసీ బస్సులకు ఇన్సూరెన్స్ లేకపోవటడం కారణంగా చాలా మంది డ్రైవర్లు నష్టపోతున్నారు. ఆన్ డ్యూటీలో చనిపోతే వారికి ఎలాంటి అండ ఉండటం లేదు. గాయపడ్డ వారు సర్వీస్ నుంచి వైదొలగాల్సి వస్తున్న ఆర్థికంగా మాత్రం భరోసా లేదు. చిన్న ప్రమాదాలకు సైతం రికవరీ కింద పెద్ద ఎత్తున డ్రైవర్ల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. అరకొర జీతాలకు పనిచేసే వారు డ్యామేజ్ కు డబ్బులు కట్టాలంటే సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల ఆర్టీసీ బస్సులకు బీమా చేయించడమే సరైన మార్గం. –హన్మంతు ముదిరాజ్, టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి