బొగ్గు గనుల మైనింగ్ లీజుల గడువు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

బొగ్గు గనుల మైనింగ్ లీజుల గడువు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ప్రాంతాల్లోని భూమి లీజుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు గురువారం గెజిట్​ విడుదల చేసింది. మినరల్ కన్సెషన్ రూల్స్ -2021 ప్రకారం ప్రభుత్వ సంస్థలకు లీజు ఇచ్చిన తేదీ నుంచి 50 ఏండ్ల వరకు పొడిగించే అధికారం సర్కార్​కు ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా గడువు ముగియని ప్రాంతాల లీజు టైమ్​పీరియడ్​ను పొడిగిస్తూ ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన పలు లీజులను నిబంధనల ప్రకారం పొడిగిస్తూ నిర్ణయం తీసుకొని దశల వారీగా గెజిట్ విడుదల చేస్తున్నది. 

మైనింగ్​ లీజు పొడిగించిన ప్రాంతాలు..

కొత్తగూడెం ఏరియా సత్తుపల్లిలోని జేవీఆర్​ ఓసీపీ-1కు సంబంధించి 383.05హెక్టార్ల లీజు గడువు మార్చి 2025నాటికి తీరగా తాజాగా మార్చి 2055 వరకు పొడగించింది. జేవీఆర్​ ఓసీపీ-1 విస్తరణ 136.5 హెక్టార్ల లీజు నవంబర్ 2028 వరకు ఉండగా నవంబర్ 2058 వరకు, జేవీఆర్ ఓసీపీ-2కు చెందిన 1,300.69హెక్టార్ల లీజు ఫిబ్రవరి 2047 వరకు ఉండగా ఫిబ్రవరి 2067వరకు పొడిగించింది. ఇల్లెందు ఏరియాలోని కోయగూడెం ఓసీపీ-1కు చెందిన 247 హెక్టార్ల భూముల లీజు మే 2031 వరకు ఉండగా మే 2051నాటికి పొడిగించింది. కోయగూడెం ఓసీపీ2 ఫేజ్​-2లో 446.1 హెక్టార్ల లీజు అక్టోబర్ 2035 వరకు ఉండగా అక్టోబర్ 2065 వరకు, కోయగూడెం ఓసీపీ 2 ఫేజ్​లో 1,231.94 హెక్టార్లకు సంబంధించి లీజు గడువు ఫిబ్రవరి 2028 కాలపరిమితి కాగా తాజాగా ఫిబ్రవరి 2058 వరకు, ఇల్లెందు మూడో రెన్యువల్ ప్రాంతం 524.96 హెక్టార్ల భూములకు డిసెంబర్ 2034 గడువు కాగా డిసెంబర్ 2064 వరకు లీజు కాలపరిమితి పెంచుతూ ఇంధనశాఖ గెజిట్ జారీ చేసింది.

 మణుగూరు ఏరియాలోని ఓసీపీ-3 మైన్​కు సంబంధించి 75 హెక్టార్ల భూముల లీజు మే 2025 వరకు ఉండగా మే 2055 వరకు మైనింగ్ లీజు పెంచుతూ గెజిట్ జారీ చేసింది. భద్రాద్రి జిల్లా రామనుజవరం గ్రామ సమీపంలోని కొండాపూరం రిజర్వు ఫారెస్ట్ లో 477.03 హెక్టార్లను గతంలో 21 ఏండ్లకు లీజుకు ఇవ్వగా దానిని 2060 వరకు, గుండ్ల సింగారంలోని 373.90 హెక్టార్ల లీజును ఏప్రిల్ 2065వరకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్​పూర్​ మండలంలోని పాతగోపయ్యపల్లి, చెల్లూరు, పెద్దాపూర్ గ్రామాల పరిధిలోని 378.10 హెక్టార్ల లీజును సెప్టెంబర్ 2059 వరకు పొడిగించింది.