
- అప్పు ఇచ్చి ఇంట్లో పని చేయించుకుంటున్న నిందితుడు
- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టౌన్ లో ఘటన
ఆర్మూర్, వెలుగు: అప్పు తీసుకున్న మహిళతో వడ్డీ వ్యాపారి ఇంట్లో పని చేయించుకుంటూ వేధింపులకు పాల్పడుతుండడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆర్మూర్టౌన్లోని రాజారాంనగర్కాలనీలో నివసించే నీరుగంటి శశికళ(40), పూసలు, బట్టలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుంది. అదే కాలనీకి చెందిన గంధం శ్రీనివాస్ వద్ద కొన్నాళ్ల కింద రూ.15వేలు అప్పుగా తీసుకుంది. ఇప్పటికే రూ.36వేలు వడ్డీ కట్టినప్పటికీ ఇంకా అసలు కట్టమని శ్రీనివాస్ఒత్తిడి చేయడంతో పాటు తన ఇంట్లో ఆమెతో రోజూ బట్టలు ఉతికించడం, అంట్లు తోమే పనులు చేయిస్తున్నాడు. ఆపై డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోవాలని శశికళను వేధిస్తున్నాడు.
దీంతో భరించలేక శశికళ బుధవారం మధ్యాహ్నం ఇంట్లో చీరతో ఉరేసుకుంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయింది. తన తల్లి మృతికి గంధం శ్రీనివాస్వేధింపులే కారణమని, అప్పు డబ్బులు కట్టకపోతే ఇంట్లో పనులు చేయించుకున్నాడని మృతురాలి కొడుకు యోగేశ్వర్ రోదిస్తూ చెప్పాడు. గురువారం ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ పై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ గౌడ్తెలిపారు. ఎవరైనా వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని, ఆత్మహత్యకు పాల్పడవద్దని పేర్కొన్నారు.