వ్యాక్సినేషన్ విధానంలో కోర్టు జోక్యం వద్దు

వ్యాక్సినేషన్ విధానంలో కోర్టు జోక్యం వద్దు

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విధానంలో కోర్టులు అతిగా జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టుల అతి జోక్యం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సిన్ ధరల్లో తేడా, వ్యాక్సిన్ ల షార్టేజీ, ఆక్సిజన్ సప్లై తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా కోర్టు ప్రస్తావించిన పలు అంశాలపై కేంద్రం ఆదివారం అర్ధరాత్రి 200 పేజీల అఫిడవిట్ సమర్పించింది. వ్యాక్సిన్ ల స్టాకు, అందుబాటులో ఉన్న వనరుల కారణంగా దేశమంతటా ఒక్కసారే టీకాలు వేయడం కుదరదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ల ప్రకారమే వ్యాక్సినేషన్ పాలసీని రూపొందించామని, నిపుణుల సలహాలను పాటించామని పేర్కొంది. వ్యాక్సినేషన్ పాలసీలో ఎలాంటి అసమానత్వం, వివక్ష లేదని చెప్పింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాక్సిన్ కంపెనీలకు ఎలాంటి ఆటంకాలు సృష్టింరాదని అభిప్రాయపడింది. అధికారులు, డాక్టర్లు, సైంటిస్టులు, ఎక్స్ పర్టులు లేకుండా కోర్టులు అతిగా జోక్యం చేసుకోవడం ద్వారా కొత్త సమస్యలు, పరిణామాలు సంభవిస్తాయని వివరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ తమ ప్రజలకు ఉచితంగా టీకాలు వేయిస్తామని ప్రకటించాయని, అందువల్ల వ్యాక్సిన్ ధరలతో లబ్ధిదారులకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.   

మీడియా చేతికి అఫిడవిట్.. 

కరోనా సిచువేషన్, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ లపై సుమోటో కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఉదయం విచారణను తిరిగి ప్రారంభించింది. అయితే సర్వర్ డౌన్ అవడం వల్ల వీడియో కాన్ఫరెన్స్ కు మళ్లీ మళ్లీ అంతరాయం కలిగింది. మరోవైపు ఆదివారం రాత్రి కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలించేందుకు సమయం సరిపోదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అంతకుముందు తాము అఫిడవిట్ చదవడానికి ముందే అది మీడియాకు అందడంపై ఆరా తీసింది. అయితే తాము సుప్రీంకోర్టుకు, ఢిల్లీ ప్రభుత్వానికి మాత్రమే అఫిడవిట్ అందించామని, అది మీడియా చేతికి ఎలా చిక్కిందో తెలియదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.