డైవర్షన్​ కోసమే ఫ్రీ కరెంట్, జాతీయ రాజకీయాల డ్రామా

డైవర్షన్​ కోసమే ఫ్రీ కరెంట్, జాతీయ రాజకీయాల డ్రామా
  • కుటుంబ సభ్యుల అక్రమ సంపాదనను చూసి కేసీఆరే షాక్ తింటున్నరు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్​ ముందస్తు ఎన్నికలకు వెళతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చెప్పారు. ముందస్తు పైనే ప్రగతిభవన్​లో చర్చ సాగుతోందన్నారు. మంగళవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఈడీ దాడులు జరిగినా.. పేకాట, లిక్కర్ స్కాంలు బయటపడ్డా.. కేసీఆర్ కొడుకు, బిడ్డ పాత్ర ఉంటోందని అన్నారు. వారి అక్రమ సంపాదన చూసి కేసీఆరే షాక్​ తింటున్నారని చెప్పారు.

తోడల్లుడి కొడుకు పేరు కూడా ఇలాంటి వాటిలో వినిపించడంతో కేసీఆర్ తలపట్టుకుంటున్నారన్నారు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు పోదామనుకున్న కేసీఆర్ కు ఈ తలనొప్పులే ఎక్కువయ్యాయన్నారు. కొడుకు, బిడ్డపై సాగుతున్న చర్చను దారి మళ్లించేందుకే ఫ్రీ పవర్, దేశ రాజకీయాలంటూ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈడీ పని ఈడీ చేస్తుందని, ఆధారాలుంటే ఎవరిపైనైనా దాడులు చేస్తుందన్నారు. ఈడీ దాడులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్​కే మీటర్​ పెడుతం

ఎన్నికలు రాగానే కేసీఆర్ కు మోటార్లకు మీటర్లు గుర్తుకువస్తాయని, మోడీని బదనాం చేసేలా బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రకు కేసీఆర్ తెరదీశాడని సంజయ్​ మండిపడ్డారు. అదే జరిగితే కేసీఆర్ కే మీటర్ పెడుతామని హెచ్చరించారు. మోటర్లపై చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్ల డిస్కంలకు రూ.70 వేల కోట్ల నష్టాలు వచ్చాయని, మోటార్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇండ్లపై కరెంట్ ఛార్జీలు పెంచి వేల కోట్లు దోచుకుంటున్నారని 
ఆరోపించారు. 

రైతు సంఘాల పేరుతో డ్రామాలు

రైతు సంఘాల పేరుతో కేసీఆర్​ డ్రామాలాడుతున్నాడని సంజయ్​ మండిపడ్డారు. రైతు సంఘాల నాయకులను మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల వద్దకు, కాళేశ్వరం పంపులు మునిగిన చోటుకు, రైతుల వద్దకు తీసుకుపోతే ఆయన సంగతి తెలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్​ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, కరెంట్, ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారో ప్రజలకు క్లారిటీ ఇచ్చిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని అన్నారు.

డీహెచ్​ నుంచి సీఎంవోకు మూటలు

ఇబ్రహీంపట్నంలో ఫ్యామిలీ ప్లానింగ్​ ఆపరేషన్ల ఘటనలో నలుగురు మహిళల మృతికి మంత్రి హరీశ్ రావు, హెల్త్​ డైరెక్టర్ శ్రీనివాసరావు కారణమని సంజయ్​ ఆరోపించారు. వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని, డీహెచ్​ను సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన వైద్యశాఖ నుంచి సీఎంవోకు నెలనెలా మూటలు వస్తున్నందునే కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. హెల్త్ డైరెక్టర్ పై ఉన్నన్ని ఆరోపణలు ఎవరిపైనా లేవని, మూటలు అప్పగిస్తుండు కాబట్టే కేసీఆర్ దృష్టిలో ఆయన చాలా మంచోడని అన్నారు. ఆయననే విచారణ అధికారిగా వేసి ఈ ఘటనలో సంబంధం లేని అమాయకుడిని బలి చేశారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కు.ని. ఆపరేషన్ అంటేనే పేదోళ్లు హడలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

గురుకుల హాస్టళ్లలో దారుణ పరిస్థితులు

వర్ధన్నపేట గురుకుల హాస్టళ్లలో 60 మంది అస్వస్థతకు గురవడం దురదృష్టకరమని, రాష్ట్రంలోని చాలా గురుకులాలతోపాటు ట్రిపుల్ ఐటీల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లపై సర్కార్ కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. సౌకర్యాల గురించి అడిగినా, సమస్యలను లేవనెత్తేందుకు ప్రయత్నించినా టీచర్లను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్​ చేస్తోందని, భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని సంజయ్​ ప్రకటించారు.

ఏం చేసినా టీఆర్ఎస్ గెలవదు
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు కేసీఆర్ ఎన్నో కుట్రలు చేస్తున్నాడని, అక్కడ ఏం చేసినా టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని సంజయ్​ అన్నారు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. ఈ నెల 11న మునుగోడుకు వెళ్తామని, గెలుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వం అనేదే లేదని, ఉంటే ప్రజా సమస్యలపై చర్చించేదని అన్నారు. ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి పోయినా పట్టించుకోని పార్టీ కాంగ్రెస్ అని, టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించడానికి వీరు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కొంప ముంచే రాజకీయాలే తప్ప కేసీఆర్ కు ఇంకేమీ పట్టవని విరుచుకుపడ్డారు.