యాంటీ బయోటిక్స్​, ఇతర మందుల సప్లై ఆపేసిన సర్కారు

యాంటీ బయోటిక్స్​, ఇతర మందుల సప్లై ఆపేసిన సర్కారు
  • పది శాతం మందులు కూడా అందుబాటులో ఉంచట్లే
  • వ్యాక్సిన్లు తప్ప మందులన్నీ ప్రైవేట్‌‌లోనే కొంటున్న పాడి రైతులు

మహబూబ్​నగర్, వెలుగు : పశువుల దవాఖానాల్లో సరిపడా మందులు అందుబాటులో ఉండడం లేదు. చాలా మెడిసిన్ల సప్లైను రాష్ర్ట ప్రభుత్వం కొంత కాలంగా నిలివేసింది. దీంతో స్టాఫ్ ​ఉన్న వాటినే అడ్జెస్ట్​ చేస్తున్నారు. లక్షల్లో జీవాలు ఉంటే  పది శాతం మందులు కూడా లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో పాడి రైతులు సీజనల్​ రోగాల బారిన పడుతున్న జీవాలను ట్రీట్​మెంట్​ కోసం దవాఖానాలకు తీసుకొస్తున్నా.. డాక్టర్లు, సిబ్బంది కేవలం సూదులు ఇచ్చి పంపిస్తున్నారు. మిగతా మందులను బయటి నుంచి తెచ్చుకోవాలని చిట్టీలు రాసి ఇస్తున్నారు.
 
పాలమూరులో 70 పశువైద్య కేంద్రాలు..
మహబూబ్​నగర్​ జిల్లాలో ఒక జిల్లా పశు వైద్యశాల, ఒక ప్రాంతీయ వైద్యశాల, 26 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 42 పశు ఆరోగ్య ఉప కేంద్రాలు, మూడు మొబైల్​ పశు వైద్యశాలలు పని చేస్తున్నాయి.  జిల్లా వ్యాప్తంగా ఆవు జాతి జీవాలు 1.28 లక్షలు, బర్రెలు 76 వేలు, గొర్రెలు 9.39 లక్షలు, మేకలు 1.35 లక్షలు, కోళ్లు 27.12 లక్షలు ఉన్నాయి. వానాకాలం సీజన్‌‌లో బర్రెలు, ఆవులలో పొదుగు రోగం, బర్రెలు, దూడలు, ఆవుల్లో గుండె రోగం, గెట్టె రోగం, ఎద్దులు, కోడెలలో బ్లాక్​ క్వాటర్​ (బీక్యూ), గొర్లు, మేకల్లో బ్లూ టంగ్​, గెట్టెల రోగం, నట్టల రోగం, కోళ్లకు కొక్కెర తెగులు, తలవాపు లాంటి రోగాలు వస్తుంటాయి. అయితే, ఈ రోగాలకు సంబంధించిన మెడిసిన్లను  ప్రభుత్వం సఫ్లై చేయడం లేదు.  ప్రతి ఏటా కేవలం వ్యాక్సిన్​లు మాత్రమే పశు వైద్యశాలలకు అందజేస్తుంది. అవి కూడా ప్రతి సెంటర్‌‌‌‌లో కేవలం పది శాతమే ఉన్నాయి.  పొదుగు వ్యాధి వచ్చిన పశువులకు ఇచ్చే హయ్యర్​ యాంటీ బయోటిక్స్, పెన్సిలిన్​  పెన్సిల్సిన్​ సప్లై చేయడం లేదు. గొర్లకు జ్వరాలు, నొప్పులు వస్తే ఇచ్చే జంటామైసిన్​, టెర్రమైసిన్​, డైక్రిస్టిన్ ఇంజక్షన్లు తగినన్ని లేవు. జీవాల కాళ్లకు, నోళ్లల్లో వచ్చే అల్సర్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఎఫ్​ఎండీ సూదులు, బోరింగ్​ పౌడర్​ రెగ్యులర్​గా వస్తున్నాయి. అలాగే జీవాలు ఈనిన తర్వాత వైద్యశాలలో టించర్​ తప్పిస్తే, మిగతా మందులను మొత్తం పాడి రైతులతోనే తెప్పిస్తున్నారు. మెయిన్​గా యూట్రాటోన్, ఎక్సాఫర్​ మందులు బయటకే రాస్తున్నారు. గొర్రెలలో గాలికుంటు వ్యాధి రాకుండా వ్యాక్సిన్​ వేస్తున్నారు కానీ, ఉన్న జీవాలకు సరిపడా లేవు. ఒక వేళ జీవాలు ఈ వ్యాధి బారిన పడితే ట్రీట్​మెంట్​ కోసం వాడే ఫార్మలిన్​, హయ్యర్​ యాంటీ బయోటిక్స్​, స్ర్పేలు సప్లై చేయడం లేదు.

బయటకు రాసే మందులు
జీవాలు ఈనిన తర్వాత మాయ పడకుంటే వాటి కోసం పశువులకు తాపించే యూట్రాటోన్​, ఎక్సాఫర్​ మందులు లేవు. ఈ మందులను బయటి నుంచి తెప్పిస్తున్నారు. ఈ మందుల కోసం దాదాపు రూ.600 వరకు ఖర్చు అవుతుంది. గొర్ల కాళ్లకు కొట్టే హూకర్​ స్ప్రేను కూడా బయటి నుంచే తెప్పిస్తున్నారు. ఇది రూ.400 పడుతోంది. జ్వరాలు వాడే యాంటీ బయోటిక్స్ రూ.100 నుంచి రూ.150 (100 ఎంఎల్​ వాయిల్​), హయ్యర్​ యాంటీ బయోటిక్స్​ రూ.250 నుంచి రూ.300 ( ఐదు గ్రాములు) వరకు పాడి రైతులకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవి కాకుండా బలం టానిక్​లను ప్రభుత్వం ఇంత వరకు సఫ్లై చేయడం లేదు. ఈ టానిక్​లు ఒక లీటరు సీసా రూ.500 నుంచి రూ.700 వరకు ఖర్చు పెట్టి పాడి రైతులు బయటే కొంటున్నారు. కొందరు రైతులతే పశు వైద్యశాలల్లో మందులు లేకపోవడంతో  అక్కడికి వెళ్లడం లేదు. డైరెక్ట్​గా మెడికల్​ షాపుల వద్దకే వెళ్తున్నారు. అత్యవసరం ఉన్నప్పుడు సిబ్బందిని పిలిపించుకొని జీవాలకు చికిత్స చేయిస్తున్నారు.

ప్రైవేట్‌‌లో కొంటున్న
నా వద్ద 30 బర్రెలు ఉన్నయి. వాటికి ఏదన్న రోగమొస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వెటర్నరీ హాస్పిటల్​కు ట్రీట్​మెంట్​ కోసం తీసుకెళ్తే ఫలానా జబ్బు చేసిందని చెబుతున్నారు. కానీ, వాటికి సంబంధించిన మందులు ఇవ్వడం లేదు. డాక్టర్​తో చిట్టీ రాయించుకొని నా సొంత డబ్బుతో బయటి నుంచి ప్రైవేట్​లో కొంటున్న.
–మహేందర్​గౌడ్​, దేపల్లి, నవాబుపేట మండలం

ఏం ఫాయిదా లేదు
కొద్ది రోజుల కింద మా గొర్లకు కుంటు రోగం వచ్చింది. మిడ్జిల్​లో 
ఉన్న పశువులకు దవాఖానాకు తీసుకుపోయిన. డాక్టర్లు టెస్టులు చేసిండ్రు. కానీ, మందులు మాత్రం ఇయ్యలె. మా దగ్గర మందులు లేవు. బయటే కొనుక్కోండని చెప్పినరు. అన్ని మందులు బయటి నుంచి తెచ్చుకుంటే గవర్నమెంట్ దవాఖానా ఉండి ఏం ఫాయిదా లేదు.
–మల్లయ్య, మిడ్జిల్

అన్ని రకాల మందులు ఇయ్యాలె
నా వద్ద గొర్లు, బర్రెలు ఉన్నాయి. వాటిని జబ్బు చేసిన ప్రతిసారి మందులు తెచ్చుకోవడానికి ఇబ్బందులు వస్తున్నయి. స్థానిక పశువుల దవాఖాణాకు పోతే కొన్ని మందులే ఇస్తున్నరు. మిగతావి లేవని బయటే కొనమంటున్నరు. అన్ని రకాల మందులు సప్లై చేస్తే బాగుంటుంది.
–రాము, దేవరకద్ర