మాస్ మహారాజ్ రవితేజ తన రెగ్యులర్ మాస్ యాక్షన్‌కు భిన్నంగా, ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్ టచ్ తో ఈసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ విడుదలైంది. రవితేజ గత చిత్రాల ప్రభావం, పండగ బరిలో పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ.. ఈ చిత్రం తనదైన శైలిలో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి రోజు డీసెంట్ వసూళ్లు సాధించింది.
తొలి రోజు వసూళ్ల ఇవే..
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ. 5.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. షేర్ పరంగా చూస్తే దాదాపు రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. నైజాంలో రూ. 80 లక్షలు, ఆంధ్ర , సీడెడ్ లో రూ. 1.5 కోట్లు , కర్ణాటక , ఓవర్సీస్ కలిసి రూ. 60 లక్షలు రాబట్టింది. సంక్రాంతి రేసులో 'రాజా సాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' వంటి భారీ చిత్రాల థియేటర్ల కౌంట్ ఎక్కువగా ఉండటంతో, రవితేజ సినిమాకు స్క్రీన్లు కొంత తక్కువగానే దక్కాయి. అయినప్పటికీ, రవితేజకు ఉన్న లాయల్ ఆడియన్స్ వల్ల నైట్ షోలకు ఆక్యుపెన్సీ 43% వరకు పెరగడం సానుకూలంగా మారింది.
క్లీన్ హిట్ కావాలంటే ఎంత రావాలి?
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ దాదాపు రూ. 19 కోట్ల వరకు జరిగిందని సమాచారం. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘క్లీన్ హిట్’ అనిపించుకోవాలంటే రూ. 20 కోట్ల షేర్ మార్కును అందుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు వచ్చిన రూ. 2.90 కోట్లు మినహాయిస్తే, ఇంకా రూ. 17.10 కోట్లు రాబట్టాల్సి ఉంది. సంక్రాంతి సెలవులు ఈ చిత్రానికి ప్లస్ అయ్యే అవకాశం ఉందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఎలా ఉందంటే?
ఈ చిత్రంలో రవితేజ 'రామ్ సత్యనారాయణ'గా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన మార్క్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్లుగా ఆషికా రంగనాథ్ (మానస), డింపుల్ హయతి (బాలమణి) తమ పాత్రలకు న్యాయం చేశారు. కిషోర్ తిరుమల మార్క్ సంభాషణలు, కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతోంది. సునీల్, సత్య, వెన్నెల కిషోర్ల కామెడీ ట్రాక్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.
రవితేజ గత సినిమాల ఫలితాలు కొంత ప్రభావం చూపినప్పటికీ, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడంతో రాబోయే రోజుల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. పండగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడితే, బ్రేక్ ఈవెన్ సాధించడం మాస్ మహారాజ్‌కు పెద్ద కష్టమేమీ కాదంటున్నాయి సినీ వర్గాలు.
