నిమిష ప్రియను క్షమించం ..బ్లడ్ మనీపై బాధిత కుటుంబం ట్విస్ట్

నిమిష ప్రియను క్షమించం ..బ్లడ్ మనీపై బాధిత కుటుంబం ట్విస్ట్
  • బ్లడ్ మనీ కాదు ప్రతీకార న్యాయమే కావాలి
  • మధ్యవర్తికి తేల్చిచెప్పిన బాధిత కుటుంబం

యెమన్ లో కేరళ నర్సు ఉరిశిక్ష కేసులు మరో ట్విస్ట్..జూలై 16న ఉరిశిక్ష వాయిదా పడ్డప్పటికీ..ఇంకా ముప్పు తప్పలేదు. బ్లడ్ మనీ తీసుకునేందుకు మహది కుటుంబ నిరాకరించింది.. తమకు కావాల్సింది ప్రతీకారమే తప్ప బ్లడ్ మనీ కాదని ఆ కుటుంబం చెప్పడంతో ఉరిశిక్ష అంశం మళ్లీ మొదటికొచ్చింది. 

యెమన్, కేరళ: తమ కొడుకును చంపిన నిమిష ప్రియను క్షమించే ప్రసక్తే లేదని తలాల్ అబ్డో మహది కుటుంబం తేల్చిచెప్పింది. తమకు కావాల్సింది ప్రతీకార న్యాయమే తప్ప బ్లడ్ మనీ కాదని స్పష్టం చేసింది. నిమిష ప్రియను బతికించుకునేందుకు బ్లడ్ మనీ కింద ఆమె కుటుంబం రూ.8.6 కోట్లు ఆఫర్ చేయగా.. మహది కుటుంబం తిరస్కరించింది. తమ కొడుకును హత్య చేసిన నేరానికి నిమిషను ఉరి తీయాల్సిందేనని పట్టుబడుతోంది. 

మహది హత్య కేసులో నిమిష ప్రియకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించగా.. అమలు పలుమార్లు వాయిదా పడింది. ఈ నెల 16 బుధవారం ఉరి శిక్ష అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తన కూతురును కాపాడాలంటూ నిమిష ప్రియ తల్లి ప్రాధేయపడడంతో కేరళ మతగురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చర్చలకు ముందుకొచ్చారు. మహది కుటుంబంతో చర్చించి బ్లడ్ మనీ తీసుకునేందుకు వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబం చర్చల పట్ల సానుకూలత వ్యక్తం చేయడంతో చివరి క్షణంలో నిమిష ఉరి వాయిదా పడింది.

బ్లడ్ మనీపై బాధిత కుటుంబం ట్విస్ట్..

నిమిష ప్రియ ఉరి వాయిదా పడడంతో ఆమె తల్లి ప్రేమ కుమారి, భర్త టోమీ థామస్​లు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, వారి ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. చర్చలకు ఒప్పుకున్నట్లే చేసి మహది ఫ్యామిలీ మర్నాడే ట్విస్ట్ ఇచ్చింది. బ్లడ్ మనీ కాదు ప్రతీకార న్యాయమే కావాలని ప్రకటించింది. మృతుడి సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మహది స్పందిస్తూ..  నిమిష ప్రియ నేరం చేసింది, ఆమెను క్షమించడమన్న ప్రశ్నే లేదన్నారు. వాస్తవానికి ఉరి శిక్ష వాయిదా పడుతుందనే విషయం తాము ఊహించలేదని అబ్దుల్ ఫతాహ్ చెప్పారు.