కొత్త స్కీం ఒక్కటి లేదు.. గిరిజన బంధు ఊసేలేదు

కొత్త స్కీం ఒక్కటి లేదు.. గిరిజన బంధు ఊసేలేదు
  • రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
  • విద్య, వైద్యానికి ప్రాధాన్యం
  • దళిత బంధుకు రూ. 17,700కోట్లు 
  • ప్రతి నియోజకవర్గంలో 2వేల ఇండ్లు
  • రూ. 3లక్షల ఆర్థిక సాయం

హైదరాబాద్‌ :  పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సాగింది. గంట 43 నిమిషాల పాటు సాగిన ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రసంగంలో కొత్తదనమేమీ కనిపించలేదు. ఎన్నికల ఏడాది అయినప్పటికీ ఎలాంటి కొత్త స్కీములు ప్రకటించకపోగా.. బడ్జెట్ ప్రసంగమంతా చప్పగా సాగింది. గతంలో కేటాయించినవే మళ్లీ కేటాయించగా.. అప్పులు మాత్రం రూ.46వేల కోట్లుగా చూపారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసన సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది 2.71లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి  రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా, పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా చూపారు.  ఎన్నికల ఏడాది అయినప్పటికీ ఒక్క కొత్త పథకం ఊసులేకుండా బడ్జెట్ రూపకల్పన చేశారు.

ఈసారి బడ్డెట్లో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. విద్య రంగానికి రూ. 19,093 కోట్లు, వైద్యానికి రూ. 12,161 కోట్లు కేటాయించింది. అటు సంక్షేమానికి సైతం పెద్ద పీట వేసింది. ఆసరా పెన్షన్ల కోసం రూ.12వేల కోట్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 3,210 కోట్లు, దళిత బంధుకు రూ. 17,700 కోట్లు,బీసీ సంక్షేమానికి రూ. 6,229 కోట్లు, మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 2,200 కోట్లు, గిరిజన సంక్షేమం, ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు కేటాయించారు. రూ.3లక్షల స్కీంలో భాగంగా  ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు ఇండ్లు నిర్మించనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. అయితే గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న సర్కారు ఈసారి గిరిజన బంధును ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఈసారి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు కేటాయించారు. నీటి పారుదల శాఖకు రూ. 26,885 కోట్లు, విద్యుత్ రంగానికిరూ. 12,727 కోట్లు ప్రతాపాదించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కు రూ.200కోట్లు,  పంచాయితీ రాజ్ శాఖకు రూ.31, 426 కోట్లు, పురపాలక శాఖకు రూ.11, 372 కోట్లు కేటాయించినట్లు హరీష్ రావు ప్రకటించారు. ఈ ఏడాది బడ్జెట్ లో ఆర్ అండ్ బీ శాఖకు రూ.2,500కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.4037 కోట్లు, హోం శాఖకు రూ.9, 599 కోట్లు ప్రతిపాదించారు.