నోటిఫికేషన్ల ముచ్చట చెప్పవట్టి ఏడాదైపోతున్నా పత్తా లేదు

నోటిఫికేషన్ల ముచ్చట చెప్పవట్టి ఏడాదైపోతున్నా పత్తా లేదు
  • ఓట్ల కోసమే ఆపుతున్నట్లు అనుమానాలు
  • కొత్త పింఛన్లు ఇస్తలేరు.. 
  • డబుల్​బెడ్రూం ఇండ్లు పంచుతలేరు
  • నత్తనడకన దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్
  • గొర్రెల పంపిణీ కోసం 3.50 లక్షల మంది ఎదురుచూపులు
  • నోటిఫికేషన్ల ముచ్చట చెప్పవట్టి ఏడాదైపోతున్నా పత్తా లేదు

నెట్​వర్క్​, వెలుగు: కొత్త స్కీములు ప్రకటించినప్పుడల్లా గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు.. వాటి అమలు గురించి మాత్రం పట్టించుకోవడంలేదు. చాలా పథకాలు గ్రౌండ్​లెవల్​కు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో కాకున్నా అందులో సగమైనా ఫలితాలు ఇవ్వడంలేదు. ప్రారంభంలో కొద్ది మందికి మాత్రమే ఇచ్చి, తర్వాత స్కీములను మూలకు పడేయడంతో లక్షలాది మందికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. దళిత బంధు, డబుల్​ బెడ్రూం ఇండ్లు, కొత్త  పింఛన్లు, గొర్రెల పంపిణీ లాంటి అనేక పథకాలది ఇదే పరిస్థితి. మధ్యలో  బై ఎలక్షన్స్​ వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రం కొన్ని స్కీములకు మోక్షం కలిగింది. జాబ్​ నోటిఫికేషన్లతోపాటు పథకాలను సర్కారు కావాలనే పక్కనపెడుతున్నదని, తిరిగి ఎన్నికల ముందే వీటిని శాంక్షన్​ చేయాలని చూస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు స్కీములు, నోటిఫికేషన్లు ఇస్తే  ఓట్ల రూపంలో ప్రయోజనం చేకూరుతుందని, ఇప్పుడే అమలు చేస్తే జనం మరిచిపోతారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

దళిత బంధు ఎప్పుడిస్తరు?
హుజూరాబాద్‌‌  ఉప ఎన్నిక టైంలో ప్రారంభించిన దళిత బంధు స్కీం నత్తనడకన సాగుతున్నది. పైలెట్​ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ యూనిట్లు గ్రౌండింగ్ కావట్లేదు. ఇక్కడ 23 వేల దళిత కుటుంబాలు ఉండగా..17,556 మందిని స్కీంకు ఎంపిక చేశారు. బై ఎలక్షన్​కు ముందు రూ. 2 వేల కోట్ల ఫండ్స్​రిలీజ్​చేసి, 17,556 మంది  అకౌంట్లలో రూ. 1737.56 కోట్లు వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 1,086 యూనిట్లను (6 శాతం) మాత్రమే గ్రౌండింగ్ చేశారు. ఇక యాద్రాద్రి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో 76 దళిత ఫ్యామిలీలు ఉండగా,  66 యూనిట్లనే గ్రౌండింగ్​ చేశారు. ఇక ప్రభుత్వం పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మరో నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్​కర్నూల్​ జిల్లా సారగొండ  మండలం, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​- మండలంలో  ఈ స్కీమ్​ను 100శాతం అమలు చేయాలని నిర్ణయించినా.. ఎక్కడా ఒక్క యూనిట్​ కూడా గ్రౌండింగ్​ కాలేదు. వీటితోపాటు నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రంలోని118 నియోజకవర్గాల్లోనూ మొదటివిడత దళితబంధు అమలు చేస్తామని సర్కారు చెప్పినప్పటికీ ఆఫీసర్లు ఇంకా సర్వేలతోనే కాలం గడుపుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే  లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఆఫీసర్లకు కాకుండా లోకల్​ ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలుచోట్ల బయటకు వచ్చిన లిస్టుల్లో టీఆర్​ఎస్​ నేతలు, వాళ్ల అనుచరులు, పార్టీ కార్యకర్తల పేర్లే ఉండడంతో సామాన్య దళితులు ప్రతిరోజూ ఏదో చోట ఆందోళనకు దిగుతున్నారు.  పరిస్థితి చూస్తుంటే సర్కారుకు ఇప్పుడప్పుడే దళితబంధు యూనిట్లను గ్రౌండింగ్​చేసే ఉద్దేశం లేదని, ఎన్నికల దాకా పొడిగించేలా ఉందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. 

జాబ్​ నోటిఫికేషన్ల జాడ లేదు
వివిధ ప్రభుత్వ శాఖల్లో  1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు 2021 పీఆర్సీ రిపోర్టులో పేర్కొంది.  త్వరలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ 2020 డిసెంబర్​లో సీఎం కేసీఆర్​ ప్రకటించారు. 2021 జూన్​లోనూ ఇదే మాట చెప్పారు. ఆతర్వాత అక్టోబర్ 5న కేసీఆర్​ అసెంబ్లీలో  మాట్లాడుతూ..  వివిధ శాఖల్లో 70 వేల నుంచి 80 వేల ఖాళీలు ఉన్నాయని,  రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. దీంతో నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల బాటపట్టారు. కానీ నోటిఫికేషన్ల జాడ లేదు. అన్ని పార్టీలు, సంఘాలు ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎన్ని ఆందోళనలు చేసినా సర్కారులో చలనం లేదు. 

కొత్త పెన్షన్లు అటేపాయె
రాష్ట్ర సర్కారు మూడేండ్ల  నుంచి ఆసరా కొత్త  పింఛన్లు మంజూరు చేస్తలేదు. కొత్తగా 3,15,262 మంది వివిధ పెన్షన్లు పొందడానికి అర్హులని అధికారుల గుర్తించారు. వారి దరఖాస్తులను అప్రూవ్​ చేసినా పెన్షన్లు ఇవ్వట్లేదు. ఇందులో  1,59,452 మంది వితంతువులు, 64,749 మంది 65 ఏండ్లు నిండినవాళ్లు, 55,619 మంది దివ్యాంగులు, 6,351 మంది గీత కార్మికులు, 5,620 మంది బీడీ కార్మికులు, 3,297 మంది చేనేత కార్మికులు,10,997 మంది ఒంటరి మహిళలు, 5,485 మంది హెచ్ఐవీ, 3,692 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. 2018 ఆగస్టు లో 39,42,371 మందికి పింఛన్లు  ఇచ్చిన సర్కారు జనవరి 2022 నాటికి   36,42,999కి తగ్గించింది. కొత్త వాళ్లకు పెన్షన్​ ఇచ్చే అవకాశమున్నా అప్లికేషన్లన్నీ పెండింగ్​లో పెడుతున్నది.  ఇక పెన్షన్​ అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గించడంతో 10 లక్షల 50 వేల మంది అప్లయ్​ చేసుకున్నారు. వీటిని కూడా ప్రభుత్వం పెండింగ్​లోనే పెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్​ఎలక్షన్స్​ టైంలో ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్​ పింఛన్లకు మోక్షం కల్పించారు. ఈ లెక్కన మళ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్​ ముందే కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు కావచ్చని జనం భావిస్తున్నారు. 

గొర్ల పంపిణీ సగమే!
రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు ఒక్కో కుటుంబానికి  20 గొర్లు, ఒక పొట్టెలు చొప్పున ఇవ్వాలని  2017లో  గొర్రెల పంపిణీ  స్కీంను ప్రభుత్వం తెచ్చింది.  7, 29, 067 గొల్ల, కురుమ కుటుంబాలకు ఈ స్కీమ్​ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఫస్ట్​ ఫేజ్​లో 3 లక్షల 80  వేల యూనిట్లు పంపిణీ చేసింది. నిరుడు జులైలోనే జరగాల్సిన  సెకండ్​ ఫేజ్​ గొర్రెల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 3.50 లక్షల మంది గొల్ల, కురుమలకు ఎదురుచూపులు తప్పట్లేదు. 

పూర్తయినా ఇస్తలే
గూడు లేని పేదలందరికీ  డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని సర్కారు చెప్పి ఏడేండ్లయినా అతీగతీ లేదు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇండ్లు లేని పేద కుటుంబాలు  26 లక్షలు. ఇప్పటికి ఈ సంఖ్య 30లక్షలకు పైమాటే. కానీ ఈ ఏడేండ్ల కాలంలో సర్కారు కేవలం 2.91 లక్షల ఇండ్ల నిర్మాణ పనులు  చేపట్టింది. ఇందులో 54 వేల ఇండ్లు మాత్రమే పూర్తిచేయగా, మిగిలిన ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. పోనీ ఆ కట్టిన ఇండ్లనైనా పంపిణీ చేస్తున్నారా? అంటే అదీ లేదు. బై ఎలక్షన్స్​, బాధితుల ఆందోళనల వల్ల ఇప్పటికి 14 వేల ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు. వివిధ కారణాలతో 40 వేల ఇండ్లను పంచడంలేదు. నిర్మాణం పూర్తయిన  డబుల్​ బెడ్రూం ఇండ్ల చుట్టూ పిచ్చి చెట్లు పెరిగి బూతుబంగ్లాలను తలపిస్తున్నా పేదలకు మాత్రం ఇండ్లను అందించడం లేదు. ఇదేమని అడిగితే లబ్ధిదారుల మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్తున్నారు. కానీ, డ్రా తీసిన చోట కూడా ఇండ్లు ఇవ్వడం లేదు.

నోటిఫికేషన్ల కోసం చూస్తున్న
నేను కాకతీయ యూనివర్సిటీలో 2012లోనే ఎమ్మెస్సీ జువాలజీ పూర్తి చేసిన. 2016లో శాతవాహన నుంచి బీఎడ్​ కూడా కంప్లీట్​ చేసిన. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం  ఎదురుచూస్తున్న. ఒక్క నోటిఫికేషన్​ కూడా రాలేదు. ప్రభుత్వం ఇంకెప్పుడు నోటిఫికేషన్లు వేస్తుందో అర్థం కావట్లేదు. ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకపోవడం వల్ల  ఏజ్​ లిమిట్​ దాటిపోతున్నది. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలస్యం చేయకుండా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకుని వెంటనే జాబ్​ నోటిఫికేషన్లు వేయాలి.
- కూన రాజు, ముల్కనూరు, హనుమకొండ జిల్లా

కిరాయి కట్టలేక పోతున్నం
మాకు సొంత భూమి లేదు, సొంత ఇల్లు లేదు. కూలి పనులు చేసుకుని బతుకుతున్నం. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తదేమోనని  ఐదేండ్ల నుంచి ఎదురుచూస్తున్నం. కానీ ఇప్పటికీ ఇస్తలేదు. కూలిపనులతో పొట్టపోసుకునే మాకు ఇంటి కిరాయి కట్టుడు ఇబ్బంది అయితున్నది. మేం ఎట్ల బతకాలె సారూ.
- చట్టు చంద్రమ్మ, సుర్దేపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా

ట్రాక్టర్ కోసం ఎదురు చూస్తున్న  
ట్రాక్టర్ కోసం దళిత బంధు స్కీం కింద అప్లయ్​ చేసుకున్న. ఆరు నెలల నుంచి ఆశతో ఎదురు చూస్తున్న. ఎప్పుడు వస్తుందని ఆఫీసర్లను అడిగితే..  రేపు మాపు అంటున్నరు. మాకున్న మూడెకరాల  భూమితో పాటు ఇతర రైతుల భూములు కౌలుకు తీసుకొని వానాకాలం, యాసంగిలో దున్ని అంతో.. ఇంతో ఉపాధి పొందుదామన్న ఆలోచనతో ట్రాక్టర్ కు దరఖాస్తు చేసుకున్న. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అందించాలి.
- రాచపల్లి వంశీ ,  విలాసాగర్, జమ్మికుంట మండలం, కరీంనగర్​ జిల్లా  

డ్రాలో పేరు వచ్చినా ఇల్లు మాత్రం ఇస్తలే
మేము గత 15 ఏండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నం. డబుల్​ బెడ్రూం ఇల్లు కోసం ఏడేండ్ల సంది ఎదురుచూస్తున్నం. కట్టుడు మొదలుపెట్టినప్పటి నుంచి ఆఫీసర్లు వచ్చి సర్వే ల మీద సర్వే లు చేసిన్రు. ఈ నడుమ డ్రా తీస్తే అందులో కూడా నా పేరు వచ్చింది. కానీ ఇల్లు మాత్రం ఇస్తలేరు. కిరాయిలు కట్ట లేకపోతున్న. ఇప్పటికైనా ఇల్లు ఇయ్యాలె.
- గడ్డం నాగలక్ష్మి, బీడీ కార్మికురాలు , బీవై నగర్​, సిరిసిల్ల

దళిత బంధు యూనిట్ గ్రౌండింగ్ కాలే 
మాది హుజూరాబాద్ ​నియోజకవర్గంలోని ఇల్లందకుంట. వెల్డింగ్ షాప్ కోసం దళిత బంధు స్కీంలో దరఖాస్తు చేసుకున్న. ఇందు కోసం నాకు ట్రైనింగ్​ కూడా ఇచ్చిన్రు. కానీ ఇంతవరకు యూనిట్ గ్రౌండింగ్​ చేస్తలేరు.  పైసలు వస్తే నా షాపును మరింత డెవలప్ చేసుకుందామనుకున్న. కానీ ఆఫీసర్లు ఇయ్యాల, రేపు అంటూ దాటేస్తున్నరు.
- కొత్తూరు రవీందర్ , కరీంనగర్​ జిల్లా

కోచింగ్​ వదిలి వచ్చేసిన
నేను డిగ్రీ పూర్తిచేసి నాలుగేండ్లయితున్నది. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తయంటే రెండేండ్లు హైదరాబాద్​లో ఉండి కోచింగ్ తీసుకున్న. కరోనా పరిస్థితులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న. ఎంత ఎదురుచూసినా నోటిఫికేషన్లు వెయ్యకపోవడంతో నిరుడు ఇంటికి వచ్చేసిన. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ఆన్​లైన్​ కోచింగ్ తీసుకుంటున్న. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. ఇప్పటికైనా ప్రభుత్వం నోటిఫికేషన్ వేయాలి. 
- దారగాని వీరబాబు, ఖమ్మం