కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం మందమర్రి ఏరియాలోని మందమర్రి, రామకృష్ణాపూర్, కాసిపేట, బెల్లంపల్లి బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై ధర్నాలు చేశారు.
కార్మికులు, యూనియన్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ ఎండీ అక్బర్అలీ మాట్లాడుతూ.. మెడికల్‌బోర్డు నిర్వహణలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పాత విధానంలోనే ఇన్వాలిడేషన్ నిర్వహించాలని, మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మారుపేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించి, విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి పెండింగ్ లో ఉన్న వారికీ ఉద్యోగావకాశం కల్పించాని కోరారు.
డిస్మిస్ అయిన ఉద్యోగులకు మళ్లీ అవకాశం కల్పించాలని, డిసిప్లినరీ చర్యల కోసం 150 మస్టర్లు చేయాలనే సర్క్యులర్‌ను యాజమాన్యం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను తక్షణమే నిర్వహించాలన్నారు. అంతకు ముందు గనులు, పార్ట్మెంట్లపై ర్యాలీలు నిర్వహించి సింగరేణి ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశారు.
ధర్నాల్లో మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచిల ఏఐటీయూసీ సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, వైస్ ప్రెసిడెంట్లు బి.సుదర్శనం, ఇ.లింగయ్య, లీడర్లు రాజేశం, కె.శ్రీనివాస్, నాగేశ్వర్రావు, పిట్ సెక్రటరీలు, ఏరియా కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
