
- కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోల్ సేల్ మార్కెట్లలో అధ్వానం
- వెళ్లే దారిలోనే స్టాక్ స్టోరేజీ.. గోడౌన్లు కూడా అక్కడే..
- నిప్పురవ్వ పుట్టినా అగ్గితో అంతా బుగ్గి
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లో ఫైర్ సేఫ్టీని ఎవరూ పెద్ద సీరియస్‌గా తీసుకోవడం లేదు. వ్యాపార సముదాయాల్లో ముఖ్యంగా హోల్ సేల్ మార్కెట్లలో ఫైర్‌సేఫ్టీకి సంబంధించిన కనీస ప్రమాణాలు కూడా పాటించడంలేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే బేగంబజార్, మదీనా, చార్మినార్, రాణిగంజ్, ఉస్మాన్ గంజ్, చప్పల్ బజార్, సుల్తాన్ బజార్, ట్రూప్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్ తదితర మార్కెట్లలో ఎక్కడా కనీసం ఫైర్‌సేఫ్టీ సిలిండర్లు కూడా కనిపించవు..ఇక్కడ ఐదారు ఐదారు అంతస్థుల్లో గోడౌన్స్ఏర్పాటు చేస్తున్నారు.
చివరకు సెల్లార్లు, మెట్లను కూడా ఖాళీగా ఉంచకుండా మెరిటీయల్ తో నింపేస్తున్నారు. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లలోకి వెళ్లి చూస్తే షాపులే గోదాముల్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగినా ఆ బిల్డింగ్‌లోంచి ఒక్కరు కూడా తప్పించుకోలేని పరిస్థితి ఉంది. ఈ భవనాల్లో ఎక్కడా ఫైర్ ఎగ్జిట్లు లేవు. మెట్ల పై నుంచి నడుచుకుంటూ ఎలా వెళ్తామో ప్రమాదం జరిగితే అదే దారి నుంచి కిందకు రావాల్సిన దుస్థితి ఉంది. ఇలాంటి చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగితే తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. గుల్జార్హౌస్దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంతో అయినా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.
మాటలే.. చేతల్లేవ్..
నగరంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రతిసారి మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటనలు ఇవ్వడం తప్పితే యాక్షన్ కనిపించడం లేదు. 2022 మార్చి23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చనిపోయారు. సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో 2023 సెప్టెంబర్ 12న ఫైర్యాక్సిడెంట్తో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 2023 జనవరి 19న సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ముగ్గురు కన్నుమూశారు. మార్చి16న ఇదే ప్రాంతంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు విగతజీవులయ్యారు. నెల రోజులకే ఏప్రిల్16న కుషాయిగూడలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
2023 నవంబర్ 14న నాంపల్లిలోని బజార్ ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా తొమ్మిది మంది మరణించారు. ఇటీవల పాతబస్తీ మదీనాలోని ఓ బట్టలషాపులో చెలరేగిన మంటలు పక్క షాపులకు కూడా రాజుకున్నాయి. ఈ ప్రమదాలన్నీ జరిగినప్పుడు ఫైర్‌సేఫ్టీపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు, లీడర్లు ప్రకటలను చేశారు..కానీ, ఇప్పటివరకు చేసిందేమీ లేదు. ఆదివారం కూడా గుల్జార్హౌస్ప్రమాదం తర్వాత అధికారులు, మంత్రులు సీరియస్‌గా వ్యవహరిస్తామని ప్రకటించారు. ఇవి వట్టి మాటలేనా లేక ఏదైనా యాక్షన్ ఉంటుందా అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.
జనవాసాల్లో గోడౌన్స్ కామన్
నగరంలో వేల మంది పర్మిషన్లు లేకుండా బిజినెస్‌లు చేస్తూనే అక్కడే గోదాములు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు రెసిడెన్షియల్ అనుమతులున్న చోట బిజినెస్నడిపిస్తూ అక్కడే గోదాములు పెట్టుకుంటున్నారు. అందులో కనీసం ఫైర్ సేఫ్టీ రూల్స్పాటించడంలేదు. సామగ్రి పోకుండా పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్న వ్యాపారులు ఫైర్ సేఫ్టీని మాత్రం పట్టించుకోవడంలేదు.
రెండేండ్ల కింద సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో కూడా రెసిడెన్షియల్ పర్పస్ లో కేవలం రెండు ఫ్లోర్లకు మాత్రమే జీహెచ్ఎంసీ వద్ద అనుమతి పొందారు. కానీ పై అంతస్థుల్లో బిజినెస్ నడిపించారు. రెసిడెన్షియల్ఏరియాల్లో సుమారుగా10వేల వరకు గోదాములుండగా, స్వప్నలోక్ కాంప్లెక్స్అగ్నిప్రమాదం తర్వాత గోదాములను ఇండస్ర్టీయల్ ప్రాంతాలకు తరలిస్తామని కొందరికి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ, తర్వాత ఎందుకో సైలెన్స్ అయిపోయారు.