కేసీఆర్​ను దేవుడిలా ఊహించుకొని ఆయన బొమ్మ చెక్కారు

కేసీఆర్​ను దేవుడిలా ఊహించుకొని ఆయన బొమ్మ చెక్కారు
  •                శిల్పులను ఫలానా చిత్రాలు చెక్కాలని ఎవరూ ఆదేశించలేదు
  •                 వైటీడీఏ స్పెషలాఫీసర్​ కిషన్​రావు, ఆర్కిటెక్ట్​ ఆనంద్​ సాయి,స్థపతి వేలు వివరణ

 

సీఎం కేసీఆర్​ను దేవుడిలా ఊహించుకుని, ఆయన వల్ల తమ కుటుంబాలు బతుకుతున్నాయనే మోటివేషన్‌ తో ఆయన బొమ్మను యాదాద్రి ఆలయ రాతి స్తంభాలపై శిల్పులు చెక్కి ఉంటారని యాదగిరిగుట్ట టెంపుల్​ డెవలప్​మెంట్ అథారిటీ (వైటీడీఏ) స్పెషలాఫీసర్​ కిషన్​రావు, యాదాద్రి ఆర్కిటెక్ట్​ ఆనంద్​ సాయి, స్థపతి వేలు అన్నారు. ఫలానా బొమ్మలను చెక్కాలని శిల్పులను ఎవరూ ఆదేశించలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కోసమే బొమ్మలను చెక్కించారని అనడం సరికాదన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. అభ్యంతరాలుంటే కేసీఆర్ బొమ్మను తీసేస్తామని తెలిపారు. యాదాద్రి ఆలయంలో శిల్పులు చెక్కిన వాటిలో కారు మాత్రమే కాకుండా సైకిల్, ఎడ్లబండి, పద్మం కూడా ఉన్నాయని, ఈ కాలంలో వినియోగించే వస్తువులు భవిష్యత్తు తరాలకు తెలిపేందుకే ఇలా చెక్కుతారని వివరించారు. శిల్పులు ప్రేమతో చెక్కారు తప్పితే, ఫలానావి చెక్కాలని అధికారులెవరు సూచించలేదన్నారు. సీఎం చిత్రంతోపాటు, ఇందిరాగాంధీ, గాంధీ చిత్రాలు కూడా చెక్కారని తెలిపారు. అహోబిలం, శ్రీశైలం, కాళహస్తీ ఆలయాల్లోనూ అప్పటి పరిస్థితులకు తగ్గట్టు శిల్పాలు చెక్కారని, అహోబిలం శిలలపై గాంధీ, నెహ్రూ బొమ్మలున్నాయని అన్నారు.