BJP, TRS ఉన్నంతకాలం శాంతిలేదు : గులాంనబీ ఆజాద్

BJP, TRS ఉన్నంతకాలం శాంతిలేదు : గులాంనబీ ఆజాద్

హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్. మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన ఆయన గాంధీ భవన్ లో మాట్లాడారు. పేద ప్రజల ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామన్న మోడీ హామీ నెరవేర్చలేదన్నారు. “రైతులకు మద్దతు ధర లభించడం లేదు. నిరుద్యోగ సమస్య సవాల్ గా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని మోడీ నెరవేర్చలేదు. ప్రపంచ సగటులో భారత దేశ నిరుద్యోగ సమస్య రెండింతలు అధికంగా ఉంది. ఇది చాలా విచారకరం. భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉంది.

కాంగ్రెస్ హయాంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 10 శాతం ఉండేది. బీజేపీ పాలనలో అది 5 శాతానికి పడిపోయింది. పెట్రోల్, డీజిల్ పై పన్నులు వేసి కేంద్రం 13లక్షల కోట్లు రూపాయలు ప్రజలపై భారం వేసింది. మద్దతు ధర లభించక రైతులు పేదరికంలోకి వెళ్తున్నారు. పురుగుమందులపై 18శాతం పన్నులు పెంచి రైతుల మీద భారం మోపుతున్నారు. తెలంగాణలో ఆర్టిసికార్మికుల సమ్మె వార్తలు ఢిల్లీ పత్రికల్లో ప్రముకంగా వస్తున్నాయి. 50వేల మంది కార్మికులు సమ్మె చేస్తుంటే.. ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరం. 20మంది కార్మికులు చనిపోవడం దారుణం.

అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నా. తహసీల్దార్ విజయరెడ్డి హత్య హేయమైన చర్య. ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. బాబ్రీ అంశం ఎన్నికలొచ్చినప్పుడల్లా ముందుకు వస్తుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం శాంతినెలకొనదు”. అని తెలిపారు గులాంనబీ ఆజాద్.