హెచ్ఎండీఏలో అంతా సైలెంట్! .. హైరైజ్ బిల్డింగ్​లకు నో పర్మిషన్

హెచ్ఎండీఏలో అంతా సైలెంట్! ..  హైరైజ్ బిల్డింగ్​లకు నో పర్మిషన్
  •     రెండు నెలలుగా ఫుల్​స్టాప్​
  •     మల్టీ స్టోరీడ్ ​బిల్డింగ్​కమిటీ మీటింగ్ ల్లేవ్  
  •     గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై ఆరా
  •     మాజీ డైరెక్టర్ అవినీతి బట్టబయలు 
  •     మరింత లోతుగా ఆరా తీయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం
  •     భవన నిర్మాణ దారుల్లో నెలకొన్న ఆందోళన

హైదరాబాద్,వెలుగు :  సిటీలో  హైరైజ్ ​బిల్డింగ్(భారీ భవనాలు)ల నిర్మాణాలకు అధికంగా అప్లికేషన్లు వస్తుంటే... రెండు నెలలుగా హెచ్ఎండీఏ అధికారులు పర్మిషన్లను నిలిపేశారు. ఇటీవల హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బండారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో  అధికారుల్లో భయాందోళన నెలకొంది. ఆయన ఇంకెన్ని అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చారోననే ప్రచారం సాగుతున్నది.  ప్లానింగ్​ విభాగానికి వచ్చే భారీ భవన నిర్మాణాల దరఖాస్తులపై కొత్త ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకున్నా అధికారులు పర్మిషన్లను నిలిపి వేయడంపై రియల్టర్లలో టెన్షన్ నెలకొంది. అంతేకాకుండా మల్టీ స్టోరీడ్ ​బిల్డింగ్స్​కమిటీ (ఎంఎస్​బీసీ) మీటింగ్​లు కూడా నిర్వహించడం లేదు. కమిటీ అప్రూవల్స్​తోనే హైరైజ్ బిల్డింగ్​లకు పర్మిషన్లు ఇస్తారు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చాక అధికారులు పారదర్శకంగా పని చేయాలని, భవన నిర్మాణ పర్మిషన్లలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా చూస్తామని సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు అవినీతి అధికారులపైన చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. దీంతో కొందరు అధికారులు ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన, అనుమతులిస్తే ఏమవుతుందోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజాయతీ అధికారులు పనితీరుపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా పర్మిషన్లను నిలిపివేయడంతో సర్కార్​కు వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. 

గత ప్రభుత్వ అనుమతులపై.. 

హెచ్ఎండీఏ పరిధిలో రియల్​ఎస్టేట్​ను ప్రోత్సహిస్తామని గత ప్రభుత్వ హయాంలో చెప్పడమే కాకుండా భారీ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. అయితే.. వాటిపై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోకుండా ఫ్లోర్​ స్పేస్ ​ఇండెక్స్​(ఎఫ్ఎస్ఐ)కు కూడా పర్మిషన్లు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పదుల సంఖ్యలో ఫ్లోర్లతో భవనాల నిర్మాణాలకు అధికారులు అనుమతులిచ్చేశారు. తద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ ఫ్లోర్లను నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. హెచ్ఎండీఏ పరిధిలో గతేడాది 93 భారీ భవనాలకు అనుతులు ఇచ్చారు. ఇందులో 10 కమర్షియల్​ కాంప్లెక్స్​లు, 11 భారీ ఆస్పత్రులు, మిగిలినవి అపార్ట్​మెంట్స్​ఉన్నాయి. అయితే.. రియల్​ఎస్టేట్​పేరుతో భూముల ధరలు పెరగడానికే  కొన్ని భారీ భవనాలకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇలాంటి భవనాల నిర్మాణం పూర్తయితే భవిష్యత్​లో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​ సమస్యలు ఉత్పన్నమవడమే కాకుండా వసతి సదుపాయాలకు ఇబ్బందులు వస్తాయని.. గత ప్రభుత్వం ఇస్టానుసారంగా ఇచ్చిన అనుమతులపై కూడా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, హెచ్​ఎండీఏ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.  ఇలాంటి నిర్మాణాలు ఉన్న చోట భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్యులు భూములు కొనే వీలు లేకుండా పోతుంది. అలాంటి భవనాలకు ఎన్విరాన్​మెంటల్​ క్లియరెన్స్ ​అసెస్​మెంట్​అథారిటీ అనుమతులు కూడా తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హెచ్​ఎండీఏ వద్ద దాదాపు 150 వరకు భారీ భవన నిర్మాణాలకు దరఖాస్తులు పెండింగ్​లో ఉండగా ఇప్పటికీ కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నట్టు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 

పర్మిషన్లు పెండింగ్.. 

హెచ్ఎండీఏ అధికారులు హైరైజ్ బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులను నిలిపేయడంతో రియల్టర్లలో ఆందోళన మొదలైంది. రూ. కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టామని.. పర్మిషన్లు రాకపోతే నిర్మాణాలు ఆలస్యమవుతాయని పలువురు రియల్టర్లు పేర్కొంటున్నారు. దీంతో నష్టం వస్తుందంటున్నారు. అయితే.. రియల్ ఎస్టేట్​ డెవలప్​మెంట్​కు తమ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని ఇటీవల బిల్డర్ల సమావేశంలో  సీఎం రేవంత్​రెడ్డి స్పష్టత ఇచ్చారు. భారీ భవన నిర్మాణాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. కానీ కొందరు అధికారులు కారణాలు చెప్పకుండా పర్మిషన్లు ఆలస్యం చేస్తున్నారని కొందరు నిర్మాణదారులు చెబుతున్నారు. ఇటీవల హెచ్ఎండీఏ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బయటపడడంతో అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా స్పష్టం చేసినది తెలిసిందే. దీంతో భారీ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వడంతో మాత్రం అధికారులు ముందుకు రావడంలేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వాలని నిర్మాణదారులు కోరుతున్నారు. ఇక పర్మిషన్లు ఎందుకు నిలిపేశారనే దానిపై హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. శివ బాలకృష్ణ హెచ్ఎండీఏ నుంచి వెళ్లిపోయి చాలా రోజులైనా ఆయన ఇచ్చిన పర్మిషన్లే ప్రస్తుతం అధికారులను చెమటలు పట్టిస్తున్నాయి.