రైలు సర్వీసులను ఆపే ఉద్దేశం లేదు

రైలు సర్వీసులను ఆపే ఉద్దేశం లేదు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రైన్ సర్వీసులను తగ్గించడం లేదా ఆపేటువంటి ప్రణాళిక ఏంలేదని భారత రైల్వే స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారన్న భావనతో చాలామంది వలస కార్మికులు తమతమ స్వస్థలాలకు వెళ్తున్నారు. దాంతో వలస కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైలు సర్వీసులు అందిస్తామని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మతెలిపారు. రైళ్లకు ఎటువంటి కొరతా లేదని.. ఒకవేళ అవసరమనిపిస్తే మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు.

‘రైలు సేవలను తగ్గించడానికి లేదా ఆపడానికి ఎటువంటి ప్రణాళిక లేదు. మేం అవసరమైనన్ని రైళ్లను నడుపుతాం. ఒకవేళ అవసరమైతే డిమాండ్ మేరకు మరిన్ని రైళ్లను నడిపిస్తాం. మామూలుగా ప్రతి వేసవి కాలంలో ఇటువంటి రద్దీ సాధారణం. ఈ రద్దీని తగ్గించడానికి ఇప్పటికే కొన్ని రైళ్లను పెంచాం. తమ స్వస్థలాలకు వెళ్లాలనకునేవారికి రైళ్ల కొరత లేదు. డిమాండ్ మేరకు మరిన్ని రైళ్లు అందిస్తామని అందరికీ భరోసా ఇస్తున్నాను. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో.. రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల సంఖ్య కూడా అకస్మాత్తుగా పెరిగింది. లాక్‌డౌన్ భయం వల్లే కార్మికులు వెళ్లిపోతున్నారు. రైలు ప్రయాణం చేసేవారికి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు’ అని విలేకరుల సమావేశంలో శర్మ చెప్పారు.