పోస్టులిచ్చారు.. డ్యూటీలు వేయలే

పోస్టులిచ్చారు.. డ్యూటీలు వేయలే

తెలంగాణ నార్తర్న్‌‌ పవర్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ ( టీఎస్‍ఎన్‍పీడీసీఎల్‍)లో అనుభవం, అర్హతలు కలిగిన సివిల్‌‌ ఇంజనీర్లున్నా వారికి విధులు అప్పగించలేదు. ఇరవై, ముప్పై ఏండ్ల వర్క్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ ఉన్న ఐదుగురు సివిల్‌‌ ఈఈలు రెండేండ్లుగా కార్పొరేషన్‌‌ పరిధిలో పనిలేక విసుగు చెందుతుండగా.. కోట్లాది రూపాయల విలువైన సివిల్‌‌ వర్క్స్‌‌లో  క్వాలిటీ లోపిస్తోంది.  ఎలక్ట్రికల్‌‌ ఇంజనీర్లే మొక్కుబడిగా సివిల్‌‌ పనుల పర్యవేక్షణ చేస్తున్నారు.  ఇటీవల కురిసిన కొద్దిపాటి వానలకే టవర్లు కూలడం, పోల్స్‌‌ పడిపోవడం క్వాలిటీ పట్టించుకోకపోవడం వల్లే జరిగాయంటున్నారు.

రెండేళ్లుగా ఉత్తుత్తి జాబే

తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటుకు మొదటి ప్రాధాన్యం దక్కింది. కోతల్లేని నాణ్యమైన కరెంట్‌‌ ఇచ్చేందుకు సర్కారు కోట్లు ఖర్చు చేస్తోంది. జిల్లాల్లో అధికారుల, సిబ్బంది కొరతను తీర్చేందుకు భారీ రిక్రూట్‌‌మెంట్‌‌ చేపట్టింది. ఇందులో భాగంగా టీఎస్‍ఎన్‍పీడీసీఎల్‍లో  ఎగ్జిక్యూటివ్‍ఇంజినీర్‍ (సివిల్‍) పోస్టులను పది మంజూరు చేయగా ఇక్కడ ఐదుగురిని మాత్రమే నియమించారు. ఇందులో నలుగురిని వరంగల్‍, కరీంనగర్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్‍ఉమ్మడి జిల్లాల్లో నియమించి ఒకరిని కార్పొరేట్‌‌ ఆఫీసుకు అటాచ్‌‌ చేశారు. ఖమ్మంలో  ఒక ఉన్నతాధికారి నిబంధనలకు విరుద్ధంగా తనకు సన్నిహితుడైన ఇంజనీర్‌‌ను ఇంచార్జీ సివిల్‌‌ ఇంజనీరింగ్‌‌ బాధ్యతలు అప్పగించారు.  జిల్లాల్లో నియమించిన ఈఈలెవరికీ అఫీషియల్‌‌గా పనులను కేటాయించలేదు. దీంతో వీరు ఆఫీసుల్లోనే గడుపుతున్నారు. నిజానికి సివిల్‌‌ ఇంజనీర్లకు చేతినిండా పని ఉంటుంది.

క్వాలిటీకెవరు బాధ్యులు

కొత్త సబ్‌‌స్టేషన్ల పనులను ఈఈ (సివిల్‍) చూడాలి.  సబ్‍స్టేషన్లకు అవసరమైన నేల స్వభావం చూసి, అంచనాలను తయారు చేయాలి. సంస్థ పరిధిలో జిల్లాలో ఉన్న ఆఫీస్‍ బిల్డింగుల నిర్మాణం, పాత బిల్డింగుల నిర్వహణ చూడాలి. 24 గంటల కరెంట్‍సప్లైలో భాగంగా ట్రాన్స్‌‌ఫార్మర్ల ఏర్పాటుకు ప్లానింగ్‍, సర్వే, అవసరమైన భారీ కాంక్రీట్‍పౌండేషన్లు, బ్రేకర్ల దిమ్మెలు, టవర్లు, స్ట్రక్చర్‌‌ ఫౌండేషన్ల నిర్మాణాలను చూసే బాధ్యత కూడా వీరిదే. ఖమ్మం, వరంగల్‍, కరీంనగర్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్‍ ఉమ్మడి జిల్లాల్లో రెండేళ్లలో రూ.350 కోట్ల పనులు మొదలయ్యాయి. ఇందులో 25 నుంచి 30 శాతం పనులు సివిల్‍ డిపార్టుమెంట్‍ పరిధిలోని పనులే.  అయితే, ఎన్‍పీడీసీఎల్ పరిధిలో జరుగుతున్న  సివిల్‍పనులన్నీ  ఎలక్ర్టికల్ ఏడీఈల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. వాళ్లే బిల్లులు కూడా పాస్‌‌ చేస్తున్నారు. సివిల్‌‌ రంగంలో ఏళ్ల తరబడి అనుభవం కలిగిన సివిల్‍ఇంజినీర్లు అందుబాటులో ఉన్నారన్న సంగతి కూడా హయ్యర్‌‌ ఆఫీసర్లు గుర్తించడంలేదు. రెండేళ్లుగా రూ.వందల కోట్లతో జరుగుతున్న  పనుల్లో క్వాలిటీ ఉండడం లేదు.  ఎస్పీడీసీఎల్‌‌, ట్రాన్స్‌‌కో, జెన్‌‌కోలలో సివిల్‌‌ ఇంజనీర్లు విధులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తుంటే ఎన్సీడీసీఎల్‌‌లో మాత్రమే పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడున్న సివిల్‍ఇంజినీర్లు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారులకు రెండు మూడు సార్లు లేఖ రాసినా ఫలితం లేదు. తమ ఫిర్యాదును సీఎండీ దృష్టికి తీసుకెళ్లకుండాతమకు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు