హ్యాకర్ల చేతిలో 'రియల్ స్టార్' .. అభిమానులకు హెచ్చరిక.. అసలు ఏం జరిగిందంటే?

హ్యాకర్ల చేతిలో 'రియల్ స్టార్' .. అభిమానులకు హెచ్చరిక.. అసలు ఏం జరిగిందంటే?

సైబర్ నేరగాళ్లు ఏ ఒక్కరినీ వదలడం లేదు. తమ మాయ మాటలతో వలవేసి అందినకాడికి దోచేసుకుంటున్నారు.  సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కేటుగాళ్ల బారిన పడుతున్నారు. లేటెస్ట్ గా కన్నడ సినీ పరిశ్రమలో 'రియల్ స్టార్' గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఉపేంద్ర కు  ఇలాంటి అనుభవమే ఎదురైంది. సోమవారం ఉదయం తనతో పాటు తన భార్య ప్రియాంక ఉపేంద్ర ఫోన్‌లు హ్యాక్ అయ్యాయని ఉపేంద్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన చెందారు.

అసలు ఏం జరిగింది?

సోమవారం ఉదయం ప్రియాంక ఉపేంద్ర ఒక ఆన్‌లైన్ ఆర్డర్ డెలివరీ కోసం ఒక గుర్తు తెలియని నంబర్ నుండి ఒక మెసేజ్ అందుకున్నారు. ఆ మెసేజ్‌లో కొన్ని ప్రత్యేకమైన అక్షరాలను (special characters)  కోడ్‌ను టైప్ చేయాలని సూచించారు. ఈ కోడ్ టైప్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆమె ఫోన్ హ్యాక్ అయ్యింది. ఉపేంద్ర కూడా అదే మెసేజ్‌ను పంపించి అదే విధంగా కోడ్ టైప్ చేయమని అడిగాడు. అది హ్యాకర్ చేసిన పని అని తెలియక ఉపేంద్ర కూడా అదే విధంగా చేయడంతో ఆయన ఫోన్ కూడా హ్యాక్ అయ్యింది.

ఉపేంద్ర హెచ్చరిక!

ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఉపేంద్ర, తన ఎక్స్ ,ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి అభిమానులను, సినీ పరిశ్రమలోని తన సహచరులను హెచ్చరించారు. " నాతో పాటు నా భార్య ప్రియాంక ఫోన్‌ల నుండి ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి పంపవద్దు. ఇది హ్యాకర్ల పని. దీనిపై మేము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం. దయచేసి జాగ్రత్తగా ఉండండి" అని ఉపేంద్ర తెలిపారు. ప్రస్తుతం ఆయన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తునట్లు ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.

 

ఇటీవలి కాలంలో సెలబ్రిటీల ఫోన్లు హ్యాక్ అవ్వడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల తెలుగు నటి మంచు లక్ష్మి ఫోన్ కూడా హ్యాక్ అయింది. ఆమె ఈ అనుభవాన్ని "భయానకం" అని అభివర్ణించినప్పటికీ, సరదాగా స్పందిస్తూ "నాకు ఎప్పుడైనా డబ్బు అవసరమైతే, నేనే నేరుగా అడుగుతాను" అని జోక్ చేశారు. అదే విధంగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ చేయబడింది. ఆయన ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా తన అభిమానులకు తెలియజేసి జాగ్రత్తగా ఉండమని కోరారు.

►ALSO READ | Kantara: Chapter 1: 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' రికార్డులు.. తెలుగు హక్కులకు భారీ డీల్!

 సైబర్ నేరగాళ్లు వివిధ రకాల ట్రిక్కులను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది.. ఈ నేరాల నుండి రక్షించుకోవడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఉపేంద్ర దంపతులకు ఎదురైన ఈ అనుభవం డిజిటల్ ప్రపంచంలో ఎవరూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తారో, హ్యాకర్‌లను ఎలా పట్టుకుంటారో చూడాలి.