Kantara: Chapter 1: 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' రికార్డులు.. తెలుగు హక్కులకు భారీ డీల్!

Kantara: Chapter 1: 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' రికార్డులు.. తెలుగు హక్కులకు భారీ డీల్!

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి 'కాంతార' చిత్రానికి పీక్వెల్ గా వస్తున్న చిత్రం  'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1'. ఇప్పటికే  ఈమూవీపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టిస్తోంది.

తెలుగు హక్కులు రూ.100 కోట్లు!

 తెలుగులో 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' ను భారీగా రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మూవీ తెలుగు హక్కులు ఏకంగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడై రికార్డు సృష్టించాయి. ఒక డబ్బింగ్ సినిమాకి ఇంత భారీ ధర పలకడం భారతీయ సినీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ ఒప్పందం ద్వారా, తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల ఎంత ఆసక్తి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయడానికి పంపిణీదారులు సిద్ధమవుతున్నారు. ఈ పంపిణీ హక్కులను వివిధ ప్రాంతాలకు పలు సంస్థలు సొంతం చేసుకున్నాయి.

వాటిల్లో ముఖ్యంగా ..  నిజాం ప్రాంతంలో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విఘ్నేశ్వర డిస్ట్రిబ్యూటర్స్, తూర్పు & పశ్చిమ గోదావరి: అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ హక్కులను తీసుకుంది. ఇక గుంటూరు ఏరియాలో వారాహి చలనచిత్రం, కృష్ణా ప్రాంతంలో OKSN టెలి ఫిల్మ్స్, నెల్లూరు రిజియన్ లోఎస్.వి. శ్రీ వేంగమాంబ సినిమాస్, సీడెడ్ ప్రాంతంలో శిల్పకళ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ మూవీని పంపిణీ  చేయనున్నాయి. 
ఈ పంపిణీ ఒప్పందాలు సినిమాకి భారీ రిలీజ్‌కి మార్గం సుగమం చేశాయి. ఇక ఓటీటీ డీల్ ఇప్పటికే రూ. 120 కోట్ల మేర జరిగినట్లు సమాచారం.

'కాంతార' సృష్టించిన సంచలనం

మూడేళ్ల క్రితం విడుదలైన 'కాంతార' చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం రూ16 కోట్ల తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ఏకంగారూ400 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కర్ణాటకలోని తుళు సంస్కృతి, సంప్రదాయాలను, భూత కోల, దైవాల అంశాలను రిషబ్ శెట్టి అద్భుతంగా ఆవిష్కరించారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలో, ఈ చిత్రానికి పీక్వెల్ గా వస్తున్న 'కాంతార: చాప్టర్ 1' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ బడ్జెట్, సాంకేతికతతో..

'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' బడ్జెట్ దాని మునుపటి చిత్రానికి ఐదు నుండి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నందున, విజువల్స్ మరింత అద్భుతంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, అత్యున్నత స్థాయి సినిమాటోగ్రఫీతో విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని ఇప్పటికే మరింత పెంచాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు.

కేరళలో ఈ సినిమా హక్కులను ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దక్కించుకున్నారు. ఆయన గతంలో 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2',  'కాంతార' చిత్రాలకు కూడా కేరళ హక్కులను కొనుగోలు చేశారు. ఈ చిత్రాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,  ఇతర దేశాలలో కూడా భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా రికార్డు ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమా విడుదల తర్వాత మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.