ఆత్మీయ సమ్మేళనాల్లో ఏర్పాట్లు కరువు.. భోజనం కోసం జనం తిప్పలు

ఆత్మీయ సమ్మేళనాల్లో ఏర్పాట్లు కరువు.. భోజనం కోసం జనం తిప్పలు

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన యాదవ కుర్మలు, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనాలకు వచ్చిన జనం అవస్థలు పడ్డారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా భోజనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జనం ఆకలితో అల్లాడారు. భోజనం వడ్డించేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్లేట్ల కోసం జనం ఎగబడ్డారు. విస్తరాకులు దొరకకపోవడంతో చాలా మంది. టేకు ఆకులు,  తువ్వాళ్లలోనే భోజనం చేశారు. కార్యక్రమానికి పిలిచి కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

మునుగోడు ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా టీఆర్ఎస్ మన్నెగూడలోని బీఎంఆర్ సార్ధలో యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనం, వేద కన్వెన్షన్ హల్లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే సమ్మేళనాల్లో కనీస ఏర్పాట్లు చేయడంపై ఆయా సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కనీసం భోజన వసతి సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డారు.