రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్

రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పై రెజర్లు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఖండించారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంపై తాను ప్రధాని కార్యాలయాన్ని గానీ, హోంమంత్రితో గానీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. అంతకుముందు రెజర్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపేందుకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగారు. స్టార్ రెజ్లర్లు భజ్ రంగ్ పునియా, రవి దహియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ లతో ఆయన సుధీర్ఘ చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు విఫలం కావడంతో  బ్రిజ్ భూషన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని వారు పట్టుబట్టారు. 

పీటీ ఉషకు లేఖ.. 

ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా, దీపక్ పునియాలు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషాకు లేఖ రాశారు. బ్రిజ్‌భూషణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి, దర్యాప్తు చేయించాలని కోరారు. దాంతో పాటు బ్రిజ్‌భూషణ్ రాజీనామా చేయాలని వారి డిమాండ్లలో చేర్చారు.