
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌ను భారత్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ చట్టపరమైన అభ్యర్థన మేరకు ఇండియాలో రాయిటర్స్ ఎక్స్ ఖాతాపై నిషేధం విధించినట్లు ఎక్స్ యాజమాన్యం వెల్లడించింది. ఈ క్రమంలో రాయిటర్స్ ఎక్స్ హ్యాండిల్ బ్యాన్పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయమని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xకి ఎటువంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ALSO READ | ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ X అకౌంట్ నిలిపివేత.. కారణం ఏంటంటే..
భారత ప్రభుత్వ ఆదేశాల మేరకే రాయిటర్స్ ఎక్స్ అకౌంట్‌ను నిలిపివేశామన్న ఆ సంస్థ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు ఆదివారం (జూలై 7) కేంద్రం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. "రాయిటర్స్ ఎక్స్ హ్యాండిల్‌ను నిలిపివేయాలని అవసరం భారత ప్రభుత్వానికి లేదు. సమస్యను పరిష్కరించడానికి మేము ఎక్స్ సంస్థతో కలిసి పని చేస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో రాయిటర్స్ ఎక్స్ ఖాతాపై భారత్‌లో బ్యాన్ విధించాలని 2025, మే 7న ఎక్స్ కు ఆదేశాలు జారీ చేశాం. కానీ ఎక్స్ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయలేదు. ఎక్స్ సంస్థ ఇప్పుడు ఆ ఆర్డర్‌ను అమలు చేసినట్లు కనిపిస్తోంది. ఇది వారి తప్పు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎక్స్‌ను సంప్రదించింది’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి.
రాయిటర్స్ హ్యాండిల్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ను కోరింది. శనివారం (జూలై 6) రాత్రి నుంచి భారత్‌లో ఎక్స్ ఖాతా ఓపెన్ కావడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని కొందరు వినియోగదారులు విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాయిటర్స్ ఎక్స్ ఖాతా నిలిపివేయడంపై క్లారిటీ ఇచ్చింది.