- ఆర్టీఐ దరఖాస్తుపై 7 నెలలకు రిప్లై
- ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అరకొరే
- తెలుగులో అడిగితే ఇంగ్లిష్‌లో ఆన్సర్
- 19 నెలల్లో 7,194 పెండింగ్ అప్పీల్స్
- ఇన్ఫర్మేషన్ ఇవ్వని పీఐవోలకు నామ్‌కేవాస్తే ఫైన్లు
రాష్ట్ర సమాచార కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్న సెకండ్ అప్పీలేట్ ఫిర్యాదులు, పీఐవోలకు కమిషన్ వేసిన ఫైన్లకు సంబంధించిన వివరాలు కోరుతూ ఆర్టీఐ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లోని పీవోకు 2020 ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన యాక్టివిస్టు గంగాధర కిషోర్ దరఖాస్తు చేశారు. కమిషన్ ఆఫీసు నుంచి వచ్చే నోటీసులను తెలుగులో ఎందుకు ఇవ్వట్లేదని అడిగారు. రూల్స్ ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. 3 నెలలైనా ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో రాష్ట్ర సమాచార కమిషన్‌లో నవంబర్‌లో ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లారు. ఫస్ట్ అప్పీలేట్ అధికారి 2021 ఫిబ్రవరి 6న విచారణ చేపట్టారు. 3 నెలలు దాటినా సమాచారమివ్వని తమ ఆఫీసులోని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోలేదు. పైగా మరో వారం టైమిచ్చి కేసును మూసేశారు. దరఖాస్తు పెట్టిన 7 నెలల తర్వాత మార్చి 20న అరకొర సమాచారం పంపారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీఐ చట్టాన్ని సరిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీసులోనే ఆర్టీఐ దరఖాస్తులను సరిగా పట్టించుకోవట్లేదు. కమిషన్ ఆఫీసుకు సంబంధించిన సమాచారం అడిగితే నెలల తరబడి టైం తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసులు, సంస్థలకు వచ్చిన ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకునే కమిషన్ ఆఫీసులోనే ఇలా ఆర్టీఐ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆర్టీఐ యాక్టివిస్టులు విమర్శిస్తున్నారు.
అప్పీళ్లు, ఫిర్యాదులు గుట్టలు గుట్టలు
రాష్ట్ర సమాచార కమిషన్‌లో పెండింగ్ అప్పీళ్లు, ఫిర్యాదులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. 2019 జనవరి 1 నుంచి 2020 ఆగస్టు 15 వరకు 19 నెలల్లో 7,194 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు కమిషన్ వెల్లడించింది. ఇందులో అధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 1,648 అప్పీల్స్ రాగా తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి 755, మంచిర్యాల నుంచి 486, కుమ్రంభీం ఆసిఫాబాద్ నుంచి 454 అప్పీళ్లువచ్చాయి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు కోరిన సమాచారం ఇవ్వట్లేదని రాష్ట్ర కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే ఆ కేసు హియరింగ్ రావడానికి రెండేళ్లకు పైగా పడుతోంది. ఈ లోగా దరఖాస్తుదారుడు సమాచారంపై ఆశలు వదులుకుంటున్నారు.
ఫైన్లు అంతంతే..
రాష్ట్రంలోని గవర్నమెంట్ ఆఫీసుల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు సమాచారం ఇవ్వకపోవడం వల్లే వేలాది మంది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కింది స్థాయిలో సమాచారం ఇచ్చి ఉంటే సెకండ్ అప్పీల్‌కు రావాల్సిన అవసరం ఉండదు. అయినా కింది స్థాయిలో ఆర్టీఐ యాక్ట్‌ను లెక్క చేయని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులపై స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు కఠిన చర్యలు తీసుకోవట్లేదని ఆర్టీఐ యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు. 20 నెలల్లో కేవలం లక్షా 49 వేలు జరిమానానే విధించారని ఆర్టీఐ యాక్టివిస్టు కిషోర్ చెప్పారు. ఇందులోనూ రూ.66 వేలే రికవర్ చేశారన్నారు.
తెలుగులో నోటీసులు ఇవ్వట్లే..
రాష్ట్రంలో చాలా మంది తెలుగు భాషలోనే ఆర్టీఐకి దరఖాస్తు చేస్తున్నారు. ఫస్ట్ అప్పీలేట్, సెకండ్ అప్పీలేట్ దరఖాస్తు కూడా తెలుగులోనే సమర్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి అర్థమయ్యేలా వారికి తెలిసిన భాషలోనే నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా తెలుగులో ఇవ్వకుండా ఇంగ్లిష్ లోనే పంపిస్తున్నారు. తెలుగులో ఎందుకు ఇవ్వట్లుదని సమాచారం కోరితే తెలుగులో సమాధానాలు ఇవ్వడానికి ఉద్యోగుల్లేరని సమాచారమిచ్చారు. తెలుగు రాయడం, చదవడం తెలిసిన ఉద్యోగులు సమాచార కమిషన్ ఆఫీసులో ఎంత మంది ఉన్నారని అదే దరఖాస్తులో అడిగిన ప్రశ్నకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
