బ్లడ్ బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో 8 నెలలుగా జీతాల్లేవ్

బ్లడ్ బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో 8 నెలలుగా జీతాల్లేవ్

సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ స్టోరేజీ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు రాక.. ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో తెలియక అయోమయంలో ఉన్నారు. వీరికి ఎనిమిది నెలలుగా జీతాలు రావడంలేదు. రాష్ట్రంలోని 9 బ్లడ్ బ్యాంకులు, 31 స్టోరేజీ సెంటర్ల‌లో దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపర్ వైజర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, నలుగురు ల్యాబ్ టెక్నిషియన్లు, ఒక హెల్పర్, బ్లడ్ స్టోరేజీ సెంటర్లలో ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లు, ఒక హెల్పర్ పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ డాక్టర్లను ఇన్ చార్జీలుగా నియమించగా మరికొన్ని చోట్ల రిటైర్డు ఉద్యోగులను మెడికల్ ఆఫీసర్లుగా నియమించారు. 2007లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ లో భాగంగా రక్తహీనతతో గర్భిణులు చనిపోకుండా చూసేందుకు రిప్రొడక్వ్ చైల్డ్ హెల్త్ (ఆర్సీహెచ్) ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని నోడల్ ఏజన్సీగా పెట్టి బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ స్టోరేజీ సెంటర్లలో ఉద్యోగులను నియమించింది. ఆర్సీహెచ్ ప్రాజెక్టు నుంచి వీరికి వేతనాలు ఇచ్చారు.

2007లో ప్రారంభ మైన ఆర్సీహెచ్ 2 ప్రాజెక్టు2017 వరకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నడిచింది. నోడల్ ఎజెన్సీగా ఉన్న రెడ్ క్రాస్ సొసైటీని తప్పించి రాష్ర్ట ప్రభుత్వం 2017లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు ఈ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ స్టోరేజీ సెంటర్లలో పోస్టుల మంజూరీ కోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రభుత్వానికి లేఖ రాయగా ఆర్థిక‌ శాఖ ఆమోదం తెలిపింది. తుది అనుమతి కోసం ఫైలును సీఎం పేషీకి పంపింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను కలుపుకుని మొత్తం 214 పోస్టులను మంజూరు చేయాలన్న ఫైలు సీఎం పేషీకి చేరి దాదాపు రెండేళ్లు దాటుతున్నా ఇంత వరకు మోక్షం లభించలేదు.

దీనికి తోడు జీతాలు కూడా సరిగా రావడంలేదు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద వివిధ పథకాల నిధులనే సర్దుబాటు చేస్తూ చాలాకాలం జీతాలిచ్చారు. నవంబర్ నుంచి అసలే జీతాలు రావడంలేదు. పోస్టులను మంజూరు చేసి రెగ్యులర్ సిబ్బందిగా కొనసాగించాలని ఎన్నిసార్లు విన్నపాలు చేసినా పట్టించుకోలేదని సిబ్బంది వాపోతున్నారు. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు వినతిపత్రం ఇచ్చినా తమ సమస్య తీరలేదన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలు ఇప్పించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి