ప్రత్యామ్నాయ పంట‌‌‌‌ల‌‌‌‌కు విత్తనాలు​ దొరకట్లే

ప్రత్యామ్నాయ పంట‌‌‌‌ల‌‌‌‌కు విత్తనాలు​ దొరకట్లే
  • నేటికీ అందుబాటులోకి తేని సర్కారు
  • కొద్దిపాటి సీడ్​కు పెరిగిన రేట్లు.. నకిలీ దందా షురూ 
  • సర్కార్‍కు ముంద‌‌‌‌స్తు ప్లాన్‍ లేక.. రైతులు ఆగమాగం

వరంగల్‍, మహబూబాబాద్, వెలుగు: ‘‘యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లో వరి వెయొద్దు.. ప్రభుత్వం ఒక్క  గింజ కూడా కొనదు. .. కొనుగోలు కేంద్రాలు ఉండవు. ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేయాలే.  చెప్పేది వినకుండా వరి వేస్తే రిస్క్​లో పడుతరు ” అంటూ రైతులను హెచ్చరించిన  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు  సీడ్​ సప్లయ్​ చేయడంలో ఫెయిల్‍ అవుతోంది. సీడ్​ కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోని డీలర్లు డిమాండ్​ ఆసరా చేసుకుని సీడ్​ రేట్లు అమాంతం పెంచేశారు. కొందరైతే నకిలీ సీడ్​ దందాకు తెరలేపారు.  పంట మార్పిడి చేయాలన్న సర్కారు సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిఉన్నా పట్టించుకోలేదు.  అగ్రికల్చర్‍ ఆఫీసర్లు ’ వరి వద్దం’టూ  ఊళ్లలో ప్రచారం  చేయడం తప్ప.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.  దీంతో  వరి వేయలేక.. ఇతర పంటలు వేసుకునేందుకు మార్కెట్లో విత్తనాలు దొరక్క రైతులు ఆగమవుతున్నారు.

పల్లీ టైం దాటింది.. సన్​ ఫ్లవర్​ సీడ్​ లేదు.. 

యాసంగిలో పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, పెసర, శనగతో పాటు మినుములు, మొక్క జొన్న, కంది, ఆముదాలు, కూరగాయల్లాంటి 14 రకాల పంటలు వేయాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. అయితే , వేరుశనగ, కంది పంటల సాగుకు టైం అయిపోయింది. అక్టోబర్  చివర్లోనే ఈ పంటు వేసుకోవాలి. గడువు దాటడంతో పంట వేయలేకపోతున్నట్టు రైతులు చెప్తున్నారు.  పొద్దుతిరుగుడు, నువ్వులు, మినుములకు విత్తనాల కొరత నెలకొంది. మార్కెట్లో వరి, మొక్క జొన్న విత్తనాలు తప్పించి మిగతావి అందుబాటులో లేవు. ఇదే అదనుగా వ్యాపారులు నకిలీ సీడ్‍ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 


విత్తనాల రేట్లు పిరం
వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల విత్తనాలు వేద్దామంటే వాటి విత్తనాల రేట్లు మండిపోతున్నాయి. ఎకరంలో కూరగాయలు సాగుచేస్తే విత్తనాలకు రూ.6 వేల వరకు ఖర్చవుతుంది. గతంలో హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్​ ద్వారా 50 శాతం సబ్సిడీపై కూరగాయల విత్తనాలను ఇచ్చేది.  రైతుబంధు తర్వాత సీడ్​ సబ్సిడీ ఇవ్వడంలేదు.  దీంతో బెండ, టమాటా, గోరుచిక్కుడు, క్యాబేజీ, కాలీఫ్లవర్, దోస, బీర, కాకర, పచ్చిమిర్చి తదితర పంటలు వేసుకోనేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నా రైతులు సాహసించడంలేదు. 


 భరోసా కరువు
‘‘వరి వేస్తే ఉరే”అంటూ రైతులకు వార్నింగ్‍ ఇచ్చిన సర్కార్‍ ప్రత్యామ్నాయపంటలపై  భరోసా ఇవ్వడంలేదు. వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర పంట ఎవరు కొంటారు, ఎంత మద్దతు ధర ఇస్తారో రైతులకు సర్కారుగానీ, అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ గానీ చెప్పడంలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంకాక రైతులు  తలలు పట్టుకుంటున్నారు. సీడ్​ దుకాణాలమీద ఆఫీసర్లు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారు.