ప్రయాణికులు ఎక్కేది ఒక చోట .. బస్​షెల్టర్​ ఇంకెక్కడో

ప్రయాణికులు ఎక్కేది ఒక చోట .. బస్​షెల్టర్​ ఇంకెక్కడో
  • ప్రయాణికులు ఎక్కేది ఒక చోటబస్​షెల్టర్​ ఇంకెక్కడో
  • సిటీలో నిరుపయోగంగా బస్టాప్ లు
  • ఫుట్​ఫాల్ లేనిచోట ఏర్పాటే ప్రధాన కారణం
  • ఏసీ బస్టాప్​లో కూర్చుంటేకనిపించని బస్సులు
  • మండుటెండలో రోడ్డుపైనే ప్రయాణికుల ఎదురుచూపులు

సికింద్రాబాద్, వెలుగు:  ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండల తీవ్రతతో బయటకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. అయితే, అత్యవసరంగా బయటకు వెళ్లేవారు బస్సుల కోసం మండుటెండలోనే ఎదురుచూడాల్సి వస్తోంది. బస్సులు ఆగే చోట షెల్టర్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేసవిలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం నగరంలో పలు చోట్ల నిర్మించిన ఏసీ బస్​షెల్టర్లు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. అందుబాటులో ఉండని విధంగా వీటిని నిర్మించడంతో అక్కడ బస్సులు ఆగక, ప్రయాణికులు వెళ్లక అవి దుమ్ముకొట్టుకుపోయి నిరుపయోగంగా మారాయి. 

రూట్లు మార్చడంతో...

జీహెచ్ఎంసీ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎసీ బస్​షెల్టర్లు ప్రయాణికులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. అయితే ఏసీ బస్​షెల్టర్లకు ప్రయాణికులు రావడం లేదని, మరో వైపు చాలా ప్రాంతాల్లో బస్సు రూట్లు మార్చడం వల్ల అవి నిరూయోగంగా ఉన్నాయని జీహెచ్​ఎంసీ చెబుతుండగా.. ప్రయాణికులకు అనువుగా ఉండే ప్రాంతాల్లో వాటిని నిర్మించలేదని, దీంతో వాటి వినియోగం అంతగా లేదని ఆర్టీసీ అధికారులు చెప్తుతున్నారు. జనరల్​బస్టాప్​ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఫ్లైఓవర్లు, యూ-టర్న్​ల వల్ల రూట్లలో మార్పులు జరగడంతో చాలా చోట్ల బస్ స్టాపులు మార్చారు. అయితే పాత బస్​ షెల్టర్లు మాత్రం అలాగే ఉంచారు. దీంతో నగరంలో నిరుపయోగంగా మారిన 450 బస్​షెల్టర్లును తొలగించి ప్రయాణికులకు అనుకూలంగా ఉన్న చోట మరో 1150 షెల్టర్లు నిర్మించాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు చేశారు.  

పనిచేయని ఏసీలు

ప్రయాణికులకు మరింతగా సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో సికింద్రాబాద్, కూకట్​పల్లి, ఖైరతాబాద్, దిల్​సుఖ్​నగర్, మలక్​పేట్, తార్నాక, ఉప్పల్, నాగోల్​ప్రాంతాల్లో జీహెచ్​ఎంసీ ఏసీ బస్​షెల్టర్లను నిర్మించింది. అయితే, ఈ బస్​షెల్టర్లలో కొన్నింటిలో ఏసీలు పనిచేయడంలేదు. ముఖ్యంగా తార్నాకలోని హుడా కాంప్లెక్సు ఎదురుగా ఓ ఏసీ బస్​షెల్టర్ నిర్మించారు.  అయితే, తార్నాక చౌరస్తాలో ట్రాఫిక్​ సిగ్నల్స్​ తొలగించి ఇరువైపులా యూ-టర్న్​లు ఏర్పాటు చేయడంతో ఆ షెల్టర్​ నిరుపయోగంగా మారింది. అలాగే సికింద్రాబాద్​ వెస్లీ కాలేజీ పక్కనే ఉన్న మరో ఏసీ, సాధారణ బస్​షెల్టర్లు​ ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగకరమైన ప్లేస్​లో లేవు. అక్కడ ఫుట్​ఫాల్​సరిగా లేదని అర్టీసీ అధికారులు చెప్పినా వినకుండా జీహెచ్ఎంసీ ఆ షెల్టర్లను ఏర్పాటు చేసింది. దీంతో అవి పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ప్రయాణికులు ఎక్కువగా ఎక్కే హరిహర కళాభవన్ వద్ద వీటిని నిర్మించి ఉంటే ఉపయోగకంగా ఉండేందని ఆర్టీసీ   అధికారులు, జనం అభిప్రాయపడుతున్నారు. 

ప్రైవేటు ఏజెన్సీలను బాధ్యతల నుంచి తప్పించాలి

ఏసీ బస్​షెల్టర్ల నిర్వహణను సరిగా చేపట్టని ఏజెన్సీలపై జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలె. నిర్వహణ సరిగా లేనప్పుడు వారిని బాధ్యతల నుంచి తప్పించి మరో సంస్థకు అప్పగించాలి. నిరుపయోగంగా మారిన ఏసీ షెల్టర్లలో సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్యాసింజర్ల ఫుట్​ఫాల్​అధికంగా ఉన్న మరో చోటికి వాటిని మార్చాలి. 
– నందీశ్వర్​ రావు, సికింద్రాబాద్

జీహెచ్​ఎంసీని కోరాం..

సిటీలో కొత్తగా ఫ్లై ఓవర్లు ఏర్పడటంతో చాలా రూట్లలో ట్రాఫిక్ సిగ్నల్​ మార్చి యూ-టర్న్ లు పెట్టారు. దీంతో బస్​స్టాపుల్లో కూడా మార్పులు చేశాం. ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో బస్సులను నిలుపుతున్నాం. ఇదే క్రమంలో ప్రయాణికుల నుంచి స్పందన లేని బస్​షెల్టర్ల వద్ద బస్సులను ఆపడంలేదు. అలాంటి షెల్టర్ల వద్ద నాట్​ ఇన్​ యూజ్ అని బోర్డులు పెట్టాం. ఇలాంటి షెల్టర్లను తొలగించి ప్రయాణికులకు అనువుగా ఉన్న ప్రాంతాల్లో బస్​షెల్టర్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీని కోరాం.
–  వెంకన్న, ఆర్టీసీ రీజినల్​మేనేజర్,  సికింద్రాబాద్