మన ఊరు-మన బడికి నిధుల కొరత లేదు: సబితా ఇంద్రారెడ్డి

మన ఊరు-మన బడికి నిధుల కొరత లేదు: సబితా ఇంద్రారెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ‘మన ఊరు–మన బడి’కి నిధుల కొరత లేదని, రూ.9 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతి నెలా రూ.100కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని, పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. జిల్లాకేంద్రంలోని మాంటిస్సోరి స్కూల్​లో సైన్స్‌ ఫెయిర్​ను మంత్రి ప్రారంభించారు. టేకుమట్ల జడ్పీ హైస్కూల్​లో రూ.47లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్లతో కట్టిన కేజీబీవీ గురుకుల స్కూల్‌ బిల్డింగ్‌‌ను ప్రారంభించారు. అనంతరం భూపాలపల్లి టౌన్‌‌లోని ఇల్లెందు క్లబ్ హౌస్ లో టీఎస్ఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ‘మన ఊరు–మన బడి’, తొలిమెట్టు, నాణ్యమైన విద్యపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ‘మన ఊరు–మన బడి’ పనుల్లో స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు.

ప్రభుత్వం నుంచే ఫర్నిచర్..

స్కూళ్లలో వినియోగించే ఫర్నిచర్ రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, వీటిని డీఈవో పాఠశాలల వారీగా పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. జిల్లాస్థాయి పనులు పూర్తయితే ఏజెన్సీలు వచ్చి, పెయింటింగ్ పూర్తి చేస్తాయని చెప్పారు. పాఠశాలల్లో రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేసి, పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు, దినపత్రికలు చదివే అలవాటు చేయాలని మంత్రి సూచించారు. భూపాలపల్లి జిల్లాలో రూ.14.78కోట్లతో ఏడు కేజీబీవీ, రూ.9కోట్లతో డిగ్రీ కాలేజీ, రూ.4 కోట్లతో డైట్ కాలేజీ అభివృద్ధి చేసినట్లుగా మంత్రి ప్రకటించారు.

క్వాలిటీ పాటించాలి..

పాఠశాల అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన హెచ్చరించారు. గదుల్లో విద్యార్థులకు ఆకర్షనీయంగా కనిపించే పెయింట్ వేయాలన్నారు. పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే.. నిధులు అంత త్వరగా వస్తాయని పేర్కొన్నారు.  ఫర్నిచర్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే జిల్లాలకు సరఫరా అవుతాయన్నారు.  టీఎస్ఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో శానిటేషన్, టాయిలెట్స్ నిర్వహణ బాగుండాలన్నారు. కాగా, కేబినెట్ ఏర్పాడిన నాలుగేండ్లకు జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించడం గమనార్హం. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ దివాకర్, భూపాలపల్లి, వరంగల్‌‌ రూరల్‌‌ జిల్లా పరిషత్ చైర్‌‌పర్సన్లు జక్కు శ్రీహర్షిణీ, గండ్ర జ్యోతి, మున్సిపల్ చైర్‌‌ పర్సన్  వెంకటరాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్​తదితరులున్నారు.

నెలాఖరు నాటికి మోడల్‌ స్కూల్స్ రెడీ..

డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్రతి మండలంలో రెండు మోడల్​స్కూల్స్ సిద్ధం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందేలా ఆఫీసర్లు సమష్టిగా కృషి చేయాలన్నారు. జిల్లాలో ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినందుకు కలెక్టర్ ను, ఆఫీసర్లను అభినందించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందేలా గ్రీన్ బడ్జెట్ వినియోగిస్తూ పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ లో రన్నింగ్ వాటర్ సౌకర్యం, తాగు నీటి సౌకర్యం ఉండే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.