సర్కార్ సోలార్ పార్కులు లేనట్లే!

సర్కార్ సోలార్ పార్కులు లేనట్లే!

హైదరాబాద్‌‌, వెలుగుసోలార్‌‌ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. గతంలో నిర్ణయించిన వాటిని రద్దు చేసుకోవడంతోపాటు భవిష్యత్తులోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో సోలార్‌‌ పార్కులు ఏర్పాటుచేసే ఆలోచన లేనట్టు ప్రభుత్వ విధానాల ద్వారా స్పష్టమవుతోంది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, భూసేకరణ సమస్యగా మారడంతో సోలార్‌‌ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మెగావాట్‌‌కు 5 ఎకరాల భూమి అవసరం ఉండడంతో రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకుని ఏర్పాటు చేయడం కష్టమవుతోందని, ఇక సోలార్‌‌ పార్కుల ఏర్పాటులో సంస్థలు, వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.

గట్టు సోలార్‌‌ పార్కు రద్దు

2014, ఫిబ్రవరి28న ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా గట్టు మండలంలో సోలార్‌‌ పార్కు ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దాదాపు 5 వేల ఎకరాల్లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పార్కును రూ.600 కోట్లతో రెండు దశలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక గట్టు మండలంలో 500 మెగావాట్ల సోలార్‌‌ పార్కు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 2,500 ఎకరాలను గుర్తించింది. అయితే ఇవి మొదట ప్రభుత్వ భూములని భావించినా.. తర్వాత అసైన్డ్‌‌ ల్యాండ్స్‌‌ అని తేలింది. దీంతో సోలార్‌‌ పార్కు నిర్మాణం ఆగింది.

పైసా పెట్టుబడి లేకుండా సోలార్‌‌ పాలసీ

రాష్ట్రం వచ్చాక దక్షిణ తెలంగాణ విద్యుత్‌‌ పంపిణీ సంస్థ సోలార్‌‌పై ప్రత్యేక పాలసీ రూపొందించింది. ప్రైవేట్‌‌ సంస్థలు, వ్యక్తులు ముందుకొచ్చి సోలార్‌‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే పవర్‌‌ కొనేందుకు తాము సిద్ధమంటూ బిడ్‌‌లను ఆహ్వానించింది. 2011లో కేంద్రం తీసుకువచ్చిన జవహర్‌‌లాల్‌‌ నెహ్రూ విద్యుత్‌‌ యోజన పథకంలో భాగంగా రాష్ట్రంలో సోలార్‌‌ పవర్‌‌ పాలసీ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు  సోలార్‌‌ పాలసీలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా రాష్ట్రం ప్రస్తుతం 3,600 మెగావాట్ల సోలార్ విద్యుత్‌‌ వ్యవస్థాపక సామర్థ్యాన్ని సాధించింది.

యూనిట్‌‌కు రూ.2.85 పైసలకే ఒప్పందం

2011లో రూ.17.90పైసలు ఉన్న రేటు నేడు కాంపిటీషన్‌‌ పెరగడంతో తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌‌ సంస్థలు ఎన్టీపీసీ (700 మెగావాట్లు), సిక్కీ(400 మెగావాట్లు) ద్వారా మరో 1,100 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు డిస్కం లు ఒప్పందం చేసుకున్నాయి. మరో 18 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ సోలార్‌‌ పవర్‌‌ యూనిట్‌‌కు రూ.2.78 పైసలకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 7 పైసల చొప్పున కమీషన్‌‌ ఇస్తున్న నేపథ్యంలో యూనిట్‌‌కు రూ.2.85 పైసలకు లభించనుంది.