- ఆస్పత్రులు, గ్రౌండ్లు, రైల్వే స్టేషన్ల వద్దా కట్టడి చేయాలి
- హైవేల చుట్టుపక్కల తిరిగే పశువులను కూడా..
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ
- 8 వారాల టైమిచ్చిన సుప్రీం.. సీఎస్‌లపైనే అమలు బాధ్యత
- తదుపరి విచారణ జనవరి 13కు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: స్కూళ్లు, హాస్పిటల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గ్రౌండ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కలు కనిపించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హోంకు తరలించాల్సిందేనని చెప్పింది. స్టెరిలైజేషన్ చేసిన తర్వాత కూడా వాటిని అక్కడ వదలొద్దని పేర్కొంది. అదేవిధంగా హైవేలు, ఎక్స్ ప్రెస్ వేల చుట్టూ తిరిగే పశువులను కూడా పట్టుకుని గోశాలలకు తరలించాలని తేల్చి చెప్పింది.
ఈమేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జాతీయ రహదారుల శాఖ, స్థానిక సంస్థలు, హైవే గస్తీ బృందాలకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ(సీఎస్) లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
వీధి కుక్కల బెడద వ్యవహారంలో యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)– 2023 నిబంధనల అమలుకు సంబంధించి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యానికి గురైన వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గైడ్ లైన్స్ జారీ చేసింది.
స్కూళ్లు, హాస్పిటల్స్, బస్, రైల్వే స్టేషన్లు, గ్రౌండ్స్ వద్ద కుక్కలు లేవని నిర్ధారించేందుకు రెగ్యులర్‌గా తనిఖీలు జరపాలని ఆదేశించింది. కుక్కల బెడదకు సంబంధించి ఫెన్సింగ్, తనిఖీలపై 3 వారాల్లోగా, రోడ్లపై పశువుల తొలగింపుపై 8 వారాల్లోగా అన్ని రాష్ట్రాలు/యూటీల సెక్రటరీలు సమగ్ర నివేదికలు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లఘింస్తే సీఎస్లపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.
కుక్క కాటు ఘటనలు ఆందోళనకరం..
దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కుక్క కాటు దుర్ఘటనలు ఆందోళనకరంగా మారాయని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో దేశ ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని తేల్చిచెప్పింది. సున్నితమైన ప్రాంతాలను గుర్తించి తమ ఉత్తర్వులు అమలుచేయాలని ఆదేశించింది. ‘రాష్ట్ర ప్రభుత్వాలు/యూటీలు 2 వారాల వ్యవధిలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, హాస్పిటల్స్ గుర్తించి, వీధికుక్కల ప్రవేశాన్ని నియంత్రించేలా కంచెలు, ఇతర భద్రతా ఏర్పాట్లు చేయాలి. ప్రక్రియను శుక్రవారం నుంచి 8 వారాల్లో పూర్తి చేయాలి. ఈ నిర్వహణ కోసం నోడల్ అధికారిని నియమించాలి’ అని పేర్కొంది.
మున్సిపాలిటీలు, పంచాయతీలు ఆయా ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను తక్షణమే పట్టుకోవాలని పేర్కొంది. మరోవైపు, జంతు ప్రేమికుల తరపు అడ్వొకేట్లు కోర్టుకు పలు సూచనలుచేసే ప్రయత్నం చేశారు. కుక్కలను తొలగిస్తే కొత్త కుక్కలు ఆ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయని, ఇది ఏబీసీ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అయితే, ఈ వాదనలను బెంచ్పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న గౌరవ్ అగర్వాల్ సైతం ఓ రిపోర్టును సమర్పించారు. తదుపరి విచారణను జనవరి 13 కు వాయిదా వేసింది.
అసలు ఉద్దేశమే దెబ్బ తింటుంది..
యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) నిబంధనల ప్రకారం వాటికి వ్యాక్సిన్, స్టెరిలైజేషన్ చేయించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే స్కూల్స్, హాస్పిటల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల తదితర ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్న కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత షెల్టర్ హోంలకు తరలించాలని, వాటిని మళ్లీ అక్కడే వదిలిపెట్టడం వల్ల తమ ఆదేశాల అసలు ఉద్దేశం దెబ్బతింటుందని బెంచ్ అభిప్రాయపడింది.
‘హైవేలపై ఆలనాపాలన లేని పశువుల సంచారంపై గతంలో రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశవ్యాప్తం చేస్తున్నాం. హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలపై ఉన్న పశువులను గోశాలలకు లేదా షెల్టర్ హోంలకు తరలించి, వాటికి పునరావాసం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ‘హైవే పెట్రోల్’ టీంలు, ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాలు/యూటీల సీఎస్ లు ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలి’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
