బస్సులు యథావిధిగా నడుస్తయ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

బస్సులు యథావిధిగా నడుస్తయ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • సంక్రాంతికీ ఫ్రీ జర్నీ ఉంటుందని వెల్లడి
  • అద్దె బస్సుల ఓనర్లతో చర్చలు సఫలం

హైదరాబాద్, వెలుగు : అద్దె బస్సుల ఓనర్లు సమ్మె చేయడం లేదని, బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. సంక్రాంతి టైమ్​లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ అమలవుతుందని.. పండుగ టైమ్​లో ఈ స్కీమ్ వర్తించదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్యాసింజర్లకు ఒక ప్రకటనలో సూచించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే శుక్రవారం నుంచి సమ్మె చేస్తామని అద్దె బస్సుల ఓనర్లు చెప్పడంతో.. గురువారం బస్ భవన్​లో వారితో ఎండీ, సీవోవో, ఈడీలు చర్చలు జరిపారు. మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఇబ్బందులు పడుతున్నామని అద్దె బస్సులు ఓనర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని, టైర్లు, బస్సుల కండీషన్ తగ్గుతుందని వాళ్లు చెప్పారన్నారు.

అయితే, అద్దె బస్సుల ఓనర్ల సమస్యలను వారంలోగా పరిష్కరిస్తామని, ఇందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని, చర్చలు సఫలం కావడంతో వారు సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నారని సజ్జనార్​ చెప్పారు. అద్దె బస్సుల సంఘం ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ.. తమకున్న ఐదు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓవర్ లోడ్​తో మైలేజ్ తగ్గిందన్నారు. ఆర్టీసీ బస్సులకు ఇచ్చినట్లుగా అద్దె బస్సులకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరామన్నారు. తమ సమస్యలను సాల్వ్ చేస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో సమ్మె విరమించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. అంతకు ముందు తమ సమస్యలు పరిష్కరించాలని ట్రాన్స్​పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్​ను అద్దె బస్సుల సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో వారి సమస్యలపై మాట్లాడాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి ఫోన్ లో సూచించారు.