స్టూడెంట్స్ ఉన్నా టీచర్లు లేరు

స్టూడెంట్స్ ఉన్నా టీచర్లు లేరు

హైదరాబాద్‍, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వ కృషి చేస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. కాని జిల్లాలో వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. జిల్లాలో 686 ప్రభుత్వ ప్రైమరీ, హైస్కూల్స్ ఉన్నాయి. ఇందులో సుమారు 92 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 330 నుంచి 350 మంది టీచర్ల అవసరం ఉన్నట్లు విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. 2018–19 అకడమిక్‍ ఇయర్‍లో 1000 మంది టీచర్ల అవసరం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం చివరాఖరుకు 801 మంది విద్యా వలంటీర్లను నియమించారు. దాదాపు 200 మంది టీచర్ల లోటుతోనే విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖాధికారులు నడిపించడం గమనార్హం. 2019–20 అకడమిక్‍ ఇయర్‍లోనూ వీరిని కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయించినప్పటికీ అందులో దాదాపు 80 మంది విద్యా వలంటీర్లు వివిధ కారణాలతో ఉద్యోగంలో చేరలేదు. దానికి తోడు ఇటీవల టీఆర్టీ నియామకాల్లో సుమారు 50 మంది వరకు  స్కూల్‍ అసిస్టెంట్‍ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 670 మంది మాత్రమే విద్యా వలంటీర్లు పనిచేస్తున్నారు.

పైరవీలతో ముందుకు సాగడం లేదు

ఖైరతాబాద్‍ మండలంలో ఎన్‍బీటీ నగర్‍ ప్రభుత్వ హై స్కూల్‍లో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ సరిపడా టీచర్లు లేరు. ఈ హైస్కూల్‍లో ఒక్క హిందీ టీచర్‍ లేకపోవడం గమనార్హం. మల్డ్ ఫోర్డ్ గవర్నమెంట్ హై స్కూల్‍లో సైతం సుమారు 600కుపైగా ఉన్న విద్యార్థులకు ఒక్క హిందీ టీచర్‍తో పాటు టీచర్ల కొరత వేధిస్తుంది. బోయిన్‍పల్లి గవర్నమెంట్‍ ప్రైమరీ స్కూల్‍లో 270 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు 8 మంది టీచర్లు ఉండాల్సిన చోట కేవలం 4 గురు టీచర్లతో నెట్టుకొస్తున్నారు. అలాగే బహదూర్‍పుర మండలంలో కాలీఖమాన్‍ గవర్నమెంట్‍ హై స్కూల్‍లో సుమారు 800 మంది స్టూడెంట్స్ కు బోధించేందుకు 24 మంది టీచర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం అక్కడ 8 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. ఇలా 24 మండలాల పరిధిలో విద్యార్థుల నిష్పత్తికి సరిపడా టీచర్లు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలను గుర్తించిన అధికారులు ఆయా మండలాల పరిధిలోనే తొలుత టీచర్లను సర్దుబాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. మండల పరిధిలో ఎక్కువగా ఉన్నా టీచర్లు, విద్యా వలంటీర్లను సర్దుబాటు చేసే క్రమంలో కొందరు టీచర్లను డిప్యూటేషన్‍పై పంపారు. డిప్యూటేషన్‍ నచ్చని ఒక టీచర్ ఏకంగా ఎమ్మెల్యేతో చెప్పించుకొని డిప్యూటేషన్‍ను రద్దు చేసుకున్నారు. మరో టీచర్‍ యూనియన్‍ పెద్దలతో లాబీయింగ్‍ చేసి పోస్టింగ్‍ను రద్దు చేయించుకున్నాడు. దీంతో టీచర్లను సర్దుబాటు చేయాలనుకున్న విద్యా శాఖాధికారులు డిప్యూటేషన్‍ జోలికి పోవాలంటేనే హడలిపోతూ ప్రక్రియను అటకెక్కించారు. టీఆర్టీ నియామకాలను పూర్తి స్థాయిలో చేపట్టడానికి ఒకటి రెండు నెలలు పడుతుందని ఆలోపు ఈ డిప్యూటేషన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఒకే టీచర్ అన్ని పాఠాలను చెప్పడంతో విద్యార్థులు ఆయా సబ్జెక్టులపై దృష్టి సారించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యావేత్తలు అభిప్రాయబడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్లు, విద్యావలంటీర్లను నియమించి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనకు చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, టీచర్లు కోరుతున్నారు.

ఉన్న వారిపై అదనపు భారం

ఈ నెల 23 నుంచి ఫార్మటివ్‍ అసెస్‍మెంట్‍(ఎఫ్‍ఏ–1) పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మెజారిటీ స్కూల్స్ లో విద్యార్థులు నిష్పత్తి సరిపడా టీచర్లు లేకపోవడం విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి టీచర్ల నియామకాలకు 2017లో నోటిఫికేషన్‍ జారీ చేశారు. రెండేళ్ల పాటు బాలారిష్టాలు ఎదుర్కొని ఈ మధ్యనే 93 మందిని స్కూల్‍ అసిస్టెంట్లుగా విధుల్లోకి తీసుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. పూర్తి స్థాయిలో టీచర్ల నియామకాలు పూర్తిచేస్తేనే కొంత మేర సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని టీచర్ల యూనియన్లు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా ఎస్జీటీ, హిందీ పండిట్లు, పీఈటీ తదితర పోస్టుల నియామకాల కోసం ఎంపికైన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల కొత్తగా చేరిన స్కూల్‍ అసిస్టెంట్ల పోస్టుల్లో ఇన్నాళ్లూ పనిచేసిన విద్యా వలంటీర్లను టీచర్ల కొరత ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ విద్యాశాఖాధికారులు  సర్దుబాటు చేస్తే టీచర్ల సమస్య కొంత వరకైనా తీరేదని టీచర్లు పేర్కొంటున్నారు. టీచర్ల సర్దుబాటుకు అధికారులు చొరవ చూపడం లేదని, దాంతో ఉన్న కొందరు టీచర్లపై పనిభారం పెరిగి విద్యార్థులు నాణ్యమై విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని కొందరు టీచర్లు వాపోతున్నారు.