ట‌మాటా రైస్.. లేదు.. ఎత్తేసిన‌ హైద‌రాబాద్ హోట‌ల్స్

ట‌మాటా రైస్.. లేదు.. ఎత్తేసిన‌ హైద‌రాబాద్ హోట‌ల్స్

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు బెంబేలెత్తిస్తుండటం సామాన్యులకే కాదు.. బడా బిజినెస్​ మ్యాన్ల.. నుంచి చోట బిజినెస్​ల వరకు ప్రభావం చూపుతోంది. టమాటా పేరెత్తితేనే అల్లంత దూరానికి పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటికి మొన్న ఓ బడా ఫుడ్​ కంపెనీ.. తమ బర్గర్లలో టమాటాను తీసేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ పరిస్థితి హైదరాబాద్​లోని చాలా హోటళ్లకు వ్యాపించింది.  

నగరంలోని రెస్టారెంట్ల మెనూలో టమోటో రైస్, టమాటా సలాడ్ మాయమయ్యాయి.  నిజమండీ.. మీరు చెక్​ చేయండి ఒకసారి..  ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.140కి చేరడంతో టమాట రైస్‌ను తమ మెనూలో ఒకటిగా తయారుచేసే అనేక హోటళ్లు వాటి తయారీని నిలిపేశాయి.  

“మేము టమాటా వంటకాలు చేయడం పూర్తిగా నిలిపివేశాం. ధరలు తగ్గిన తర్వాత వీటిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని ఎల్‌బీ నగర్‌లోని హోటల్ యజమాని సతీష్ తెలిపారు.  ప్లేట్​ రైస్  ధర రూ. 70 నుంచి రూ. 100 మధ్యలో ఉంటుంది.  పచ్చిమిర్చి ధర ప్రస్తుతం రూ. కిలో 150 రూపాయలుగా ఉంది. 

" కస్టమర్లు దాని గురించి ఆరా తీస్తున్నారు. మేము మా పరిస్థితి గురించి వారికి వివరించాం. జీరా రైస్, వెజిటబుల్ బిర్యానీ ఇంకా ఏదైనా ఐటం తినమని కస్టమర్లకు సూచిస్తున్నాం” అని సరూర్‌నగర్‌లోని టిఫిన్ సెంటర్ మేనేజర్ మనోహర్ చెప్పారు.  'టమాట ధర పెరిగిందని  మేం ఫుడ్​ ధరలు పెంచితే వ్యాపారానికి దెబ్బ పడుతుంది. 

అందుకే దాన్ని స్కిప్​ చేశాం' అని సైదాబాద్‌లోని హోటల్ యజమాని సంతోష్ అన్నారు. మే, జూన్‌ నెలల్లో టమాటాలు వచ్చే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో అకాల వర్షాలతో, పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో ధరలు భారీగా పెరిగాయని తెలంగాణ ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.  

జులై నెలాఖరులోగా తాజా పంట చేతికి  వచ్చే అవకాశం ఉందని అప్పుడే  టమాట ధరలు తగ్గుతాయని వారు అంటున్నారు.