‘ఘోస్ట్ పార్టికల్స్‌‌‌‌’తో విశ్వ రహస్యం.. ఫిజిక్స్‎లో బెల్జియం సైంటిస్ట్ ఫ్రాన్సిస్‎కు నోబెల్ 

‘ఘోస్ట్ పార్టికల్స్‌‌‌‌’తో విశ్వ రహస్యం.. ఫిజిక్స్‎లో బెల్జియం సైంటిస్ట్ ఫ్రాన్సిస్‎కు నోబెల్ 

 స్టాక్‌‌‌‌‌‌‌‌హోమ్: విశ్వంలో కంటికి కనిపించకుండా నిరంతరం కాంతివేగంతో ప్రయాణించే ‘ఘోస్ట్ పార్టికల్స్‌‌‌‌‌‌‌‌’ న్యూట్రినోలపై పరిశోధనలు చేసిన బెల్జియం సైంటిస్ట్ ఫ్రాన్సిస్ హాల్జెన్‌‌‌‌‌‌‌‌(82)ను ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. ‘‘అంటార్కిటికాలో ఐస్‌‌‌‌‌‌‌‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఫ్రాన్సిస్.. అంతర్జాతీయ పరిశోధకులు, ఇంజనీర్ల బృందానికి నాయకత్వం వహించారు.

హై-ఎనర్జీ న్యూట్రినోలు అనే కాస్మిక్ కణాలను ఆవిష్కరించడం ద్వారా ఖగోళ భౌతికశాస్త్రాన్ని విప్లవాత్మక మలుపు తిప్పేందుకు దోహదం చేశారు” అని మంగళవారం స్వీడన్‌‌‌‌‌‌‌‌లోని స్టాక్‌‌‌‌‌‌‌‌హోమ్‌‌‌‌‌‌‌‌లో ఫిజిక్స్ నోబెల్ కమిటీ చైర్మన్ మార్క్ పియర్స్ ప్రకటించారు. ఈ ఏడాది నోబెల్ అవార్డుకు ఎంపికైనట్టు ఇటలీలో ఉన్న తనకు ఫోన్ రాగానే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అయ్యానని హాల్జెన్ తెలిపారు. నోబెల్​ అవార్డు వస్తుందని తాను అస్సలు ఊహించలేదన్నారు. 

బెల్జియంలో జన్మించిన ఫ్రాన్సిస్ హాల్జెన్ అమెరికాలోని విస్కాన్సిన్- మాడిసన్ యూనివర్సిటీలో ఖగోళ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నారు. విశ్వ పరిణామంపై కీలక అంశాలను తెలుసుకునేందుకు గాను విస్సాన్సిన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికాలో ఐస్‌‌‌‌‌‌‌‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రపంచమంతటా నిరంతరం ప్రయాణిస్తూ ఉండే హై ఎనర్జీ న్యూట్రినోలకు ఎలాంటి ద్రవ్యరాశి, విద్యుదావేశం ఉండదు కాబట్టి.. వాటిని భౌతికంగా గుర్తించడం చాలా కష్టం. 

అయితే, అంటార్కిటికాలోని మంచు ద్వారా ప్రయాణిస్తుండగా, వీటిని గుర్తించవచ్చని హాల్జెన్ కనుగొన్నారు. న్యూట్రినోల గుట్టును విప్పేందుకు 1980లలో దక్షిణ ధ్రువంలో అబ్జర్వేటరీ ఏర్పాటు చేయడంతోపాటు వాటిపై పరిశోధనలకు ఆయన నాయకత్వం వహించారు. నోబెల్ అవార్డులలో భాగంగా ఏటా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటిస్తుంది. 

అవార్డు కింద విజేతకు మెడల్‌‌‌‌‌‌‌‌తోపాటు 12 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల(రూ. 11.57 కోట్లు) నగదు అందజేస్తారు. ఈ ఏడాది నోబెల్ అవార్డుల ప్రకటనలు సోమవారం మెడిసిన్ నోబెల్‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమయ్యాయి. బుధవారం కెమిస్ట్రీ, గురువారం లిటరేచర్‌‌‌‌‌‌‌‌, శుక్రవారం పీస్, సోమవారం ఎకనామిక్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌లో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించనున్నారు. 

ఏమిటీ ‘ఘోస్ట్’ పార్టికల్స్..? 

న్యూట్రినో అనేది విశ్వంలో అత్యధికంగా ఉండే ప్రాథమిక కణాలలో ఒకటి. దీనికి విద్యుదావేశం ఉండదు. ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంటుంది. ఇవి ఏ పదార్థంతోనూ సులభంగా ప్రతిచర్య జరపవు. దాదాపు కాంతివేగంతో ప్రయాణిస్తాయి. భూమిని, ఇతర భారీ అడ్డంకులను సైతం ఇవి ఏకధాటిగా దాటుకుని వెళ్ళగలవు. ప్రతిక్షణం మనిషి దేహం గుండా సైతం లక్షలాది న్యూట్రినో కణాలు దాటుకుని వెళ్తున్నా.. ఆ విషయమే మనిషికి ఏమాత్రం తెలియదు. 

అందుకే, వీటిని ఘోస్ట్ పార్టికల్స్ (దెయ్యం కణాలు) అని కూడా అంటారు. అయితే, సాధారణ న్యూట్రినోలతో పోలిస్తే.. నక్షత్రాల పేలుళ్లు, బ్లాక్‌‌‌‌‌‌‌‌హోల్స్, గెలాక్సీ కేంద్రాల నుంచి విడుదలయ్యే అత్యున్నత శక్తి కలిగిన న్యూట్రినోలను హై-ఎనర్జీ న్యూట్రినోలుగా పిలుస్తారు. విశ్వంలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ కణాలపై అధ్యయనం ద్వారా విశ్వం ఆవిర్భావం, విశ్వంలో ఉండే విపరీత వాతావరణ పరిస్థితులను సైంటిస్టులు తెలుసుకునేందుకు వీలు కలుగుతోంది.