టచ్​ను ఎట్ల గుర్తిస్తున్నమో కనుగొన్నోళ్లకు నోబెల్​

టచ్​ను ఎట్ల గుర్తిస్తున్నమో కనుగొన్నోళ్లకు నోబెల్​
  • ఈసారి మెడిసిన్​లో అమెరికా సైంటిస్టులు ఇద్దరికి అవార్డు

స్టాక్​హోమ్: దెబ్బ తగిలితే మనకు నొప్పి ఎలా తెలుస్తోంది? ఎవరైనా టచ్ చేసినట్టు ఎలా ఫీలవగలుగుతున్నాం? ఇలాంటి వేడి, స్పర్శలను శరీరం ఎలా గుర్తిస్తుందో కనుగొన్న ఇద్దరు సైంటిస్టులే ఈసారి నోబెల్​ప్రైజ్ కు ఎంపికయ్యారు. టచ్, టెంపరేచర్​ రిసెప్టార్లను కనుగొన్న అమెరికాకు చెందిన డేవిడ్​ జులియస్, అర్డెమ్​పటపౌటియన్​లను మెడిసిన్ లో నోబెల్​కు సెలెక్ట్​ చేసినట్టు నోబెల్​ జ్యూరీ వెల్లడించింది. మన శరీరం బయటి పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నదో ఇంతకుముందు వరకు సైంటిస్టులకు చాలా తక్కువ తెలుసని, వీళ్లద్దరి పరిశోధనలతో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయని జ్యూరీ చెప్పింది. సెన్స్​యొక్క సైకాలజీని మనం అర్థం చేసుకున్నామని.. అయితే వేడి, ఒత్తిడిని వేర్వేరుగా శరీరం ఎలా గుర్తిస్తోందో కనుక్కోలేదని వివరించింది. ఇలాంటి మార్పులను పసిగట్టే అణువులను (రిసెప్టార్లను) కనుక్కోవడం గేమ్​ చేంజర్​ అని చెప్పింది. వీటి వల్ల దీర్ఘకాలిక రోగాలు, నొప్పి బాధల నుంచి ఉపశమనం దొరికే అవకాశం ఉందంది. తాజా పరిశోధనల ఫలితంగా నొప్పికి సంబంధించిన ట్రీట్​మెంట్స్​తీరే మారిపోవచ్చని చెప్పింది. సైంటిస్టులు ఇప్పటికే స్పర్శకు సంబంధించిన రిసెప్టార్లను టార్గెట్​ చేసే డ్రగ్స్​ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారంది. గుండె సంబంధిత రోగాల ట్రీట్​మెంట్​కు కూడా ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది.
మిరపకాయల్లోని కాప్సయిసిన్​ను వాడి..
అమెరికాలోని న్యూయార్క్​లో డేవిడ్ ​జులియస్ పుట్టారు. శాన్​ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పని చేస్తున్నారు. మన శరీరంలోని నరాలు వేడికి చర్మం ప్రతిస్పందించేలా ఎలా కమ్యూనికేట్​ చేస్తాయో తెలుసుకోవడానికి మిరపకాయల్లోని కాప్సయిసిన్​ను వాడి డేవిడ్​ ప్రయోగాలు చేశారు. మరో సైంటిస్టు పటాపౌటియన్ లెబనాన్​లో పుట్టారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని స్క్రిప్స్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​లో పని చేస్తున్నారు. యాంత్రిక ప్రేరణ (మెకానికల్​ సిములేషన్)లకు స్పందించే ప్రెజర్​ సెన్సిటివ్​ సెన్సర్లను మనుషుల కణాల్లో పటాపౌటియన్​గుర్తించారు. వేడి, ఒత్తిడికి ప్రతిస్పందించే గ్రాహకాలను (రిసెప్టార్స్) చర్మంలో ఈ సైంటిస్టులు కనుగొన్నారు. నోబెల్​ ప్రైజ్​తో పాటు గోల్డ్​ మెడల్, రూ.8.5 కోట్ల ప్రైజ్​మనీ అందిస్తారు. వీళ్లిద్దరికీ గతేడాదే న్యూరో సైన్స్​లో కవ్లీ అవార్డు వచ్చింది.