ఆ పాత్రకు ధనుష్‌ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు: డైరెక్టర్ ఓం రౌత్‌

ఆ పాత్రకు ధనుష్‌ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు: డైరెక్టర్ ఓం రౌత్‌

డైరెక్టర్‌ ఓం రౌత్.. తెలుగు ఆడియన్స్కి పరిచయం అక్కర్లేని పేరు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో బాగా వైరల్ అయ్యారు. ఆదిపురుష్ తెరకెక్కించిన రెండేళ్ల తర్వాత తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసి మళ్ళీ లైన్ లోకివచ్చారు. ఇపుడు ఏకంగా భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం బయోపిక్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

కలాం బయోపిక్:

డైరెక్టర్‌ ఓం రౌత్.. ‘కలాం’ అనే టైటిల్తో మూవీ తెరకెక్కిస్తున్నారు. అబ్దుల్ కలాం పాత్రలో స్టార్ హీరో ధనుష్ నటిస్తున్నారు. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోస్టర్ రిలీజ్ చేయగా మంచి ఆదరణ దక్కింది. ఈ క్రమంలో లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో ఓం రౌత్‌ పాల్గొని.. కలాం బయోపిక్ విశేషాలు షేర్ చేసుకున్నారు.

ఓం రౌత్‌ మాట్లాడుతూ.. ‘‘హీరో ధనుష్‌ వర్సటైల్ యాక్టర్. ఈ మూవీకి ఆయన కాకుండా మరెవ్వరూ న్యాయం చేయలేరు. కలాం పాత్రలో ధనుష్ ఒదిగి పోతారు. అంతేకాదు.. ఆయన ప్రతి సీన్ లోనూ కలాంను గుర్తు తెస్తారు. అది ఆయన తన నటనపై చూపించే అభిమానం. కలాం బయోపిక్లో నటించడానికి తాను ఒప్పుకోవడం నా అదృష్టం. ఆయనతో వర్క్ మొదలు పెట్టడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఓం రౌత్‌ తెలిపారు.

అంతేకాకుండా ఈ మూవీ సినీ ఆడియన్స్కి మాత్రమే కాకుండా, కలాం గారిని అభిమానించే వారికి, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఆయా రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న వారికి ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని కలిగించేలా ఉంటుందని’’ ఓం రౌత్‌ వెల్లడించారు.

ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మారి సెల్వరాజ్‌తో కలిసి ఒక చిత్రం మరియు హిందీ చిత్రం తేరే ఇష్క్ మే ఉన్నాయి. అలాగే, తన దర్శకత్వంలోనే ఇడ్లీ కడై చేస్తున్నాడు. ఈ కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత కలాం ప్రాజెక్ట్‌ షురూ కానునట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తన్హాజీ, ఆదిపురుష్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఓం రౌత్ తన మూడో ప్రాజెక్ట్ తో సాహసం చేస్తున్నాడు. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వంటి మహాన్నోత వ్యక్తి బయోపిక్ ను టచ్ చేసి పెద్ద సాహసమే చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాలను డైరెక్టర్‌ ఓం రౌత్ ప్రస్తావించనున్నారు. కలాం శాస్త్రవేత్తగా ఎదిగిన విధానం, భారత అంతరిక్ష పరిశోధనా, రక్షణ పరిశోధన రంగాలను అభివృద్ధి దిశలో నడిపిన తీరును కళ్ళకు కట్టినట్లుగా చూపించనున్నారు. మరి ధనుష్ ను ఓం రౌత్ ఎలా చూపించనున్నాడనేది ఆసక్తి నెలకొంది.