ఈ టార్చర్ భరిస్తూ బతకలేను: ప్రొఫెసర్ వేధింపులతో మరో విద్యార్థిని సూసైడ్

ఈ టార్చర్ భరిస్తూ బతకలేను: ప్రొఫెసర్ వేధింపులతో మరో విద్యార్థిని సూసైడ్

న్యూఢిల్లీ: ప్రొఫెసర్ వేధింపులు భరించలేక ఓడిషాకు చెందిన ఓ విద్యార్థిని ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపగా.. తాజాగా ఇలాంటి తరహా ఘటనే ఉత్తరప్రదేశ్‎లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. ప్రొఫెసర్ల వేధింపుల భరించలేక ఎంతో భవిష్యత్ ఉన్నా జ్యోతి శర్మ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు సూసైడ్ లెటర్ రాసి తనను టార్చర్ చేసిన కీచకుల పేర్లను లేఖలో రాసింది. మృతురాలి సూసైడ్ నోట్ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జ్యోతి శర్మను వేధించిన ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. హర్యానాలోని గురుగ్రామ్‎కు చెందిన జ్యోతి శర్మ అనే యువతి గ్రేటర్ నోయిడాలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో బీడీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో జ్యోతిని యూనివర్శిటీలోని ఓ ఇద్దరు ప్రొఫెసర్లు గత కొంత కాలంగా వేధిస్తున్నారు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక శుక్రవారం (జూలై 18) తన హాస్టల్ రూమ్‎లో జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతి రూములో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాం.

తనను మానసిక క్షోభకు గురి చేసిన వారి పేర్లను సూసైడ్ నోట్‎లో రాసింది. ‘‘వాళ్ళను జైలుకు పంపాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు నన్ను మానసికంగా వేధించారు. అవమానించారు. చాలా కాలంగా నేను ఈ ఒత్తిడిలో ఉన్నా. వాళ్ళు కూడా నాలాగే నరకం అనుభవించాలని నేను కోరుకుంటున్నా’’ అని జ్యోతి తన సూసైడ్ నోట్‌లో రాసిందని తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రేటర్ నోయిడా అదనపు డీసీపీ సుధీర్ కుమార్ తెలిపారు.

ALSO  READ : క్షమాపణ చెప్పండి: వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‎కు భారత పైలట్ల సంఘం లీగల్ నోటీస్

ఇద్దరిని అరెస్ట్ చేశామని.. పోస్టుమార్టం నిమిత్తం జ్యోతి డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. జ్యోతిని వేధించిన ఇద్దరు అధ్యాపకులను సస్పెండ్ చేసినట్లు వర్శిటీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ అజిత్ కుమార్  తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.