క్షమాపణ చెప్పండి: వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‎కు భారత పైలట్ల సంఘం లీగల్ నోటీస్

క్షమాపణ చెప్పండి: వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‎కు భారత పైలట్ల సంఘం లీగల్ నోటీస్

న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాద ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమంటూ ఏఏఐబీ ప్రాథమిక నివేదికను ఉటంకిస్తూ ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ ప్రమాదంపై దర్యాప్తు పూర్తి కాకముందే, ఏఏఐబీ ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా పైలట్ల తప్పిదమే ప్రమాదానికి కారణమని కథనాలు ప్రచురించడంతో వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‎ వార్త సంస్థలపై భారత పైలట్ల సమాఖ్య (FIP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వార్త సంస్థలకు లీగల్ నోటీసులు పంపించింది.

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తప్పుడు కథనాలు ప్రచురించింనందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎఫ్ఐపీ డిమాండ్ చేసింది. ఆధారాలు లేకుండా పైలట్లను తప్పుగా నిందించడం సరికాదని.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తప్పుడు వ్యాప్తి చేయవద్దని లీగల్ నోటీసులో హెచ్చరించింది. ఏఏఐబీ తుది దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచిచూడాలని.. అప్పటి వరకు తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దని కోరింది.

ఓ వైపు ఈ ఘటనపు దర్యాప్తు కొనసాగుతుండగానే ఇటువంటి చర్యలు బాధ్యతారాహిత్యమని చురకలంటించింది. మీడియా జర్నలిస్టిక్ సమగ్రతను కాపాడుకోవాలని,  ప్రజలను తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని సూచించింది. ఊహాజనిత కంటెంట్‌ను ప్రచురించి మరణించిన పైలట్ల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చే ఊహాజనిత కథనాల వల్ల పైలట్లు కుటుంబాలతో పాటు మృతుల ఫ్యామిలీలు తీవ్ర ఆవేదనకు గురై అవుతున్నాయని పేర్కొంది. 

ALSO READ : సౌత్ ఇండియాలో మొదటి న్యూస్ పేపర్ ఏది.? ఎపుడు స్థాపించారు?

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై మీడియాలో వచ్చే కథనాలు పైలట్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఎఫ్ఐపీ వాపోయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాసి భారత విమానయాన పరిశ్రమ భద్రత పట్ల ప్రజలలో ఆందోళన సృష్టించొద్దని కోరింది. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని ఎఫ్ఐపీ మీడియాకు విజ్ఞప్తి చేసింది. 

కాగా, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. విమానంలోని ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‎ల్లో అనూహ్య మార్పుల వల్లే ప్లయిట్ క్రాష్ అయ్యిందని ఏఏఐబీ తేల్చింది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన మూడు సెకన్లకే ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‎లు సెకన్ల వ్యవధిలోనే రన్ మోడ్ నుంచి కటాఫ్ మోడ్‎కు మారాయి.. ఫ్యూయెల్ స్విచ్‎లు ఒకేసారి షట్ డౌన్ కావడంతో ఫ్లైట్‎కు ఇంధన సరఫరా నిలిచిపోయింది.

 దీంతో ఫ్లైట్ గాల్లోనే థ్రస్ట్‌ కోల్పోయి రెండు ఇంజిన్లు ఆగిపోయాయని తెలిపింది ఏఏఐబీ. వెంటనే అప్రమత్తమైన ఓ పైలట్.. ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‎లు ఎందుకు కటాఫ్ చేశావని ప్రశ్నించగా.. మరొక పైలట్ ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‎లు తాను ఆఫ్ చేయలేదని బదులిచ్చినట్లు కాక్ పిట్ వాయిస్ రికార్డ్‎లో నమోదైనట్లు వెల్లడించింది ఏఏఐబీ. ఏఏఐబీ ప్రాథమిక నివేదికను ఆధారం చేసుకుని పలు మీడియా సంస్థలు.. పైలట్ల తప్పిదం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం  జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చి ఆ మేరకు కథనాలు ప్రచురించాయి.