ట్విన్ టవర్స్ కూల్చివేతకు ముహూర్తం ఖరారు

ట్విన్ టవర్స్ కూల్చివేతకు ముహూర్తం ఖరారు

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్స్ కూల్చివేతకు ముహూర్తం ఖరారైంది. అగస్ట్ 21న ఈ భవనాలను కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని మే 22న కూల్చివేయాల్సివుండగా సుప్రీంకోర్టు మరో మూడు నెలల గడువు ఇచ్చింది. అగస్ట్ 28 లోపు ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని తీర్పునిచ్చింది. అయితే అధికారులు అంతకంటే ముందుగానే వీటిని కూల్చివేయనున్నారు.  2009లో సూపర్ టెక్ కంపెనీ  నోయిడాలోని సెక్టార్ 93 ప్రాంతంలో భారీ భవన నిర్మాణం చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని స్థానికులు ఆరోపించారు. దీంతో పలువురు స్థానికులు కోర్టును ఆశ్రయించారు. 

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 40 అంతస్థుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని ఆదేశించింది. అంతేగాక అందులో ఫ్లాట్లను కొన్నవారికి 12శాతం వడ్డీతో డబ్బులు తిరిగివ్వాలని చెప్పింది. ఇక కోర్టు తీర్పుతో ఈ భవనాల కూల్చివేతలను ఎడిఫైస్ కంపెనీకి అప్పగించారు అధికారులు. జూన్ 30లోగా ప్రీ డెమాలిష్  స్ట్రక్చర్ రిపోర్టును అందజేయాలను సదరు కంపెనీని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా నిర్మాణ వ్యర్థ్యాలను ఎక్కడ పారబోస్తారో తెలియజేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రిపోర్టును అందజేయాలన్నారు.

ఇక  కూల్చివేతలకు సంబంధించిన ఎటువంటి హానీ జరగదని..ఒకవేళ జరిగితే బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాగా తొలుత  మే 22న ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని నిర్ణయించి టెస్ట్ బ్లాస్ట్ కూడా నిర్వహించారు. అయితే ఊహించిన దానికన్న ఈ భవనం ధృఢంగా ఉన్నట్లు గుర్తించిన కంపెనీ మరింత సమయం కావాలని కోర్టును కోరింది. దీంతో అగస్ట్ 28వరకు సుప్రీం గడువునిచ్చింది.