చెవులు మూసుకోవాలి : జూబ్లీహిల్స్, తార్నాక నైట్ టైం సౌండ్ పొల్యూషన్

చెవులు మూసుకోవాలి : జూబ్లీహిల్స్, తార్నాక నైట్ టైం సౌండ్ పొల్యూషన్

హైదరాబాద్ లో శబ్ద కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, తార్నాకలో అదీ ఎక్కువగా రాత్రి సమయాల్లో దీని తీవ్రత మితిమీరిపోతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. జనవరి నుంచి జూన్ నెలలకు సంబంధించి నగరవ్యాప్తంగా శబ్ద స్థాయిలు పెరిగినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ట్రాఫిక్ జామ్ లు, స్ట్రీట్ ఫుడ్ అండ్ షాపింగ్ మాల్స్ వంటివి పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి.

నగరం మధ్యలో ఉన్న తార్నాకలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో రాత్రిపూట కూడా నిరంతరాయంగా కార్యకలాపాలు నిర్వహించడం వల్ల శబ్ద కాలుష్యం స్థాయిలు పీక్ లెవల్ కి చేరుకుంటున్నాయి. TSPCB పరిసర శబ్ద స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తున్న హైదరాబాద్‌లోని 10 స్థానాల్లో , 2023 ప్రథమార్థంలో కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే డెసిబెల్ (dB) స్థాయిలు పరిమితుల్లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అబిడ్స్, సనత్‌నగర్, జీడిమెట్ల, గడ్డపోతారం ఉన్నాయి. వీటిలో కొన్ని వాణిజ్య, పారిశ్రామిక మండలాలను సూచిస్తాయి.

నెహ్రూ జూలాజికల్ పార్క్, గచ్చిబౌలి వంటి సున్నితమైన ప్రాంతాలలో పగటిపూట, రాత్రి సమయాల్లోనూ సౌండ్ పొల్యూషన్ లెవల్స్ పెరిగాయి. సాధారణంగా నివాస ప్రాంతాలకు పగటిపూట 55 dB(A), రాత్రి సమయంలో 45 dB(A) శబ్ద స్థాయిలు ఉండాలి. వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట 65 dB(A) వరకు, రాత్రి 55 dB(A) వరకు శబ్ద స్థాయిలను కలిగి ఉండటానికి అనుమతి ఉంది.