రోజా పదవి కట్: మంత్రి పదవి కోసమా.. టార్గెట్ చేశారా?

రోజా పదవి కట్: మంత్రి పదవి కోసమా.. టార్గెట్ చేశారా?

అమరావతి: వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ షాకిచ్చారా..? ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి నుండి రోజాను తప్పించి మెట్టు గోవిందరెడ్డిని నియమించడం హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో 135 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ శనివారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంతో మందికి.. అవివాహితులకు.. పట్టుమని పాతికేళ్లు లేని వారికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన సీఎం జగన్.. తనకు ఆది నుండి అండగా నిలుస్తున్న రోజా విషయంలో జగన్ వైఖరి ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. 
మంత్రి పదవి ఫిక్స్ అంటూ అభిమానుల ప్రచారం
చంద్రబాబును ఎదుర్కోవడంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రోజా దూకుడుగా వ్యవహరించడం జగన్ కు చాలా నచ్చిందని.. అదే దూకుడును ఆమె కొనసాగించడం కోసమే మంత్రి పదవిలోకి తీసుకుంటున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత జగన్ మనసులో ఏముందనేది అటు రోజాకు.. ఇటు జగన్ కు మాత్రమే తెలుసని.. ఈ విషయంలో ఆలోచించాల్సిందేమీ లేదంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ సీఎం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చన్న ప్రచారం నేపధ్యంలో ఇప్పుడు రోజాను ఏపీఐఐసీ నుంచి తప్పించడం మంత్రి పదవి ఇవ్వడం కోసమేనంటూ మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చ మంత్రి పదవిని ఆశిస్తున్న ఔత్సాహికుల్లో ఊపు తెస్తోంది.