దుబ్బాక ఉప ఎన్నిక నామినేషన్లలో కలియుగ పాండవుల నామినేషన్‌

దుబ్బాక ఉప ఎన్నిక నామినేషన్లలో కలియుగ పాండవుల నామినేషన్‌

మెదక్ జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఇటీవల చనిపోవడంతో.. ఆ స్థానంలో ఉప ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. దీంతో ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ  ఇవాళ్టి(శుక్రవారం) నుంచి ప్రారంభమైంది. అయితే… మొదటి రోజు ఓ ఆసక్తికర ఘటన జరిగింది.

కలియుగ పాండవుల పేరుతో ఐదుగురు యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. తొలిరోజు మొత్తం ఆరుగురు నామినేషన్లు దాఖలు చేయగా… వారిలో ఐదుగురు కలియుగ పాండవులే ఉన్నారు. వేముల వాడకు చెందిన బుర్ర రవితేజ గౌడ్‌, ఉప్పల్ కు చెందిన రేవు చిన్న ధనరాజ్‌, కరీంనగర్ కు చెందిన కె.శ్యామ్‌కుమార్‌, ధర్మపురికి చెందిన  మోతె నరేశ్‌, చొప్పదండికి చెందిన  మీసాల నామినేషన్లు సమర్పించారు. కలియుగ పాండవుల్లా తాము పోరాడతామని చెప్పుకొచ్చారు. అంతేకాదు నిరుద్యోగ సమస్యపై తాము పోరాడతామని..కరోనా  చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.

దుబ్బాక ఉప ఎన్నిక వచ్చేనెల(నవంబర్) 3న జరగనుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల(అక్టోబర్) 16 వరకు గడువుంది.