- డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ల కు ముగిసిన ఉప సంహరణ గడువు
- నల్గొండ నుంచి 8 మంది, రంగారెడ్డి నుంచి ఆరుగురు పోటీ
- ఆలేరు ఎమ్మెల్యే బీర్ల, మాజీ డీసీసీబీ గొంగిడి వర్గాల మధ్య పోరు
- ఈ నెల13న డైరెక్టర్ల ఎన్నికలు.. షురువైన క్యాంపు రాజకీయాలు
నల్గొండ, వెలుగు : మదర్ డెయిరీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. 6 డైరెక్టర్పోస్టులకు మొత్తం12 మంది బరిలో నిలిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 డైరెక్టర్ స్థానాలకు 8 మంది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 సీట్లకు నలుగురు పోటీ పడుతున్నారు. ఒక్క ఏరియా నుంచే 8 మంది పోటీ చేస్తుండగా.. ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ పైనే ఆసక్తి నెలకొంది.
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్యానల్లో కల్లెపల్లి శ్రీశైలం, గుడిపాటి మధుసూద న్ రెడ్డి, పుప్పాల నర్సింహులు, బత్తుల నరేందర్‌రెడ్డి ఉన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి ప్యానల్లో ఒగ్గు భిక్షపతి, డి.సోమిరెడ్డి, ఎం కొండల్‌రెడ్డి, భాస్కర్ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల తరపున నలుగురు పోటీ పడుతున్నారు. పరిగి నుంచి ఇద్దరు, మాల్, కందుకూరు నుంచి ఇద్దరు బరిలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా నుంచి బీఆర్ఎస్క్యాండిడేట్లు పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఏ. నర్సింహారెడ్డి, పగడాల గణేశ్, మండలి జంగయ్య, ఎడ్ల రాంరెడ్డి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది.
రెండు జిల్లాలకు సపరేట్ బ్యాలెట్
ఈ నెల13న డెయిరీ ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సపరేట్బ్యాలెట్ఉంటుంది. దీంతో ప్రతి ఓటరు ఆరు ఓట్లు వేసుకోవచ్చు. అయితే.. ఒక బ్యాలెట్లో 4 ఓట్లు, రెండో బ్యాలెట్లో 2 ఓట్లు వేయాలి. మొత్తం పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు వచ్చిన అభ్యర్థిని డైరెక్టర్‌గా ప్రకటిస్తారు. ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య తొలిసారిగా డెయిరీ ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తన అనుచరుడు మధుసూదన్‌రెడ్డిని చైర్మన్చేయాలని భావిస్తున్నారు. మరోవైపు గొంగిడి మహేందర్‌రెడ్డి తన ప్యానల్లోని కొండల్‌రెడ్డిని రంగంలోకి దింపారు. దీంతో ఆలేరు చుట్టే డెయిరీ ఎన్నికల రాజకీయాలు తిరుగుతున్నారు. ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు క్యాంపులకు ఓటర్లు తరలించే ఏర్పాట్లను ఇరువర్గాలు చేస్తున్నాయి.