
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నామినేషన్ ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా.. మన రాష్ట్రంలో కూడా ఈ రోజు నామినేషన్లు భాగానే వేశారు.. ఇందులో కొందరు సిట్టింగ్ లు అభ్యర్థులు ఉండగా.. మరి కొందరు ఈ సారే లోక్ సభకు మొదటి సారి పోటీచేస్తున్నారు. వారి పూర్తి వివరాలు ఇవే..
నిజామాబాద్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్య్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కవిత నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. దేశమంతా కేసీఆర్ వైపే చూస్తోందన్నారు.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో టిఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతుందన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీఅభ్యర్థిగా దర్మపురి అరవింద్ నామినేషన్ వేశారు. అరవింద్ మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనావాస్ రెండవ కొడుకు. ఈయన ఈమధ్యనే బీజేపీలో చేరారు. వీరికి ఎన్నికలలో పోటీ చేయడం ఇదే మొదటిసారి.
నల్గొండ లోక్ సభ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. తన విజయం పై ధీమా వ్యక్తం చేసిన ఆయన ఈ సారి రాహుల్ ప్రధాని అవడం తథ్యమని అన్నారు.
మల్కాజిగిరి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. కార్యకర్తలు, శ్రేణులతో ర్యాలీగా వచ్చిన నేతలు.. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జహీరాబాద్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున… ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు సంగారెడ్డి కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు.
మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుండి మన్నె శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు.
నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు నామినేషన్ దాఖలు చేశారు.
చేవెళ్ల లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారు.
వరంగల్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మాటి సాంబయ్య, టీడీపీ నుంచి హన్మకొండ సాంబయ్య నామినేషన్ వేశారు.
మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి గా మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ పార్టీ నుండి పోరిక బలరాం నాయక్ నామినేషన్ వేశారు.
ఖమ్మం ఎంపీ స్థానానికి సిపిఎం అభ్యర్థి బోడా వెంకట్ నామినేషన్ వేయగా..
ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కుమ్ర వందన నామినేషన్ దాఖలు చేశారు .
రేపు, ఎల్లుండి నాలుగో శనివారం,ఆదివారం కావడంతో నామినేషన్లకు సెలవు. నామినేషన్లకు 25తేది ఒక్క రోజు మాత్రమే ఉండడంతో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.