కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ

కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ
  •  మొన్న 5.. నిన్న 35 దాఖలు 
  •  బ్యాంకు మాజీ చైర్మన్ కర్రా రాజశేఖర్ ప్యానల్ నామినేషన్

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గం ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. మొదటి రోజు మంగళవారం ఐదుగురు నామినేషన్ దాఖలు చేయగా.. రెండో రోజు 22న 35 నామినేషన్లు సమర్పించారు. 

బ్యాంకు ఆవరణలో ఎలక్షన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నామినేషన్లు స్వీకరించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇందులో జనరల్ కేటగిరీలో 32 నామినేషన్లు, మహిళా కేటగిరీలో 3, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారంతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. 

బరిలో మాజీ చైర్మన్ కర్రా రాజశేఖర్ ప్యానెల్ 

 కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో పోటీకి బ్యాంకు మాజీ చైర్మన్ కర్రా రాజశేఖర్ ప్యానెల్ సిద్ధమైంది. ఈ ప్యానల్‌‌లో కర్రా రాజశేఖర్ తోపాటు బాశెట్టి కిషన్, తాడ వీరారెడ్డి, బొమ్మరాతి సాయికృష్ణ, ముద్దసాని శ్వేత, వరాల జ్యోతి, బండి ప్రశాంత్ దీపక్, తాటికొండ భాస్కర్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, దేశ వేదాద్రి, ఎండీ షామియోద్దీన్ ఉన్నారు. వీరిలో 8 మంది బుధవారం నామినేషన్లు దాఖలు చేయగా.. మరో ముగ్గురు గురువారం నామినేషన్లు సమర్పించనున్నారు. కర్రా రాజశేఖర్ ప్యానెల్‌‌లో గతంలో డైరెక్టర్లుగా పనిచేసినవారే ఎక్కువ మంది ఉండడం విశేషం. 

కాంగ్రెస్ ప్యానల్ లేదు.. 

అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో అధికార పార్టీకి చెందినవారే ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండడం, గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే చైర్మన్, డైరెక్టర్లు ఎక్కువకాలం అర్బన్ బ్యాంకు పాలకవర్గ సభ్యులుగా పనిచేయడం అనే అంశాలపై అధ్యయనం చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ప్యానల్ ఏర్పాటు చేయడం లేదని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. కాగా ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచే ఎక్కువ మంది పోటీలో ఉంటున్నారని, వారే గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.