మాజీ డీఎస్పీ ప్రణీత్​రావుపై నాన్​ బెయిలబుల్​ కేసు

మాజీ డీఎస్పీ ప్రణీత్​రావుపై నాన్​ బెయిలబుల్​ కేసు

 

  • ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్​
  • ఎస్​ఐబీ అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఠాణాలో కేసు
  • ప్రణీత్​రావుకు సహకరించిన అధికారులపైనా ఎఫ్​ఐఆర్​ నమోదు

పంజాగుట్ట, వెలుగు: ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో  సస్పెండైన మాజీ డీఎస్పీ ప్రణీత్​రావుపై హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో నాన్​ బెయిలబుల్​ కేసు నమోదైంది. స్పెషల్​ ఇంటెలిజెన్స్ బ్రాంచ్​(ఎస్​ఐబీ) అదనపు ఎస్పీ డి.రమేశ్​ ఆదివారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రణీత్​రావుతోపాటు ఆయనకు సహకరించిన అధికారులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. గత బీఆర్​ఎస్​ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ విభాగంలో ప్రణీత్​రావు కీలక పోస్టులో ఉన్నాడు. 

అప్పట్లో ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలు, ప్రజాసంఘాల, జర్నలిస్టుల కీలక సమాచారాన్ని సేకరించి ఎస్​ఐబీ లాగర్​లో భద్రపరిచేవాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నాటి అధికార పార్టీ బీఆర్​ఎస్​కు  వ్యతిరేకంగా రావడంతో ..  ప్రణీత్​రావు ఎస్​ఐబీ ఆఫీసులో సీసీ కెమెరాలను ఆఫ్​ చేసి, అక్కడి హార్డ్​డిస్కుల్లోని సమాచారం మొత్తాన్ని  మరో సిస్టంలోకి ట్రాన్స్​ఫర్​చేశాడు. అప్పటి వరకు వినియోగించిన కంప్యూటర్లు, హార్డ్​డిస్కులను కూడా ధ్వంసం చేశాడు. ఇట్ల ఫోన్​ ట్యాపింగ్​పై ఆధారాలను మాయం చేసేందుకు ప్రణీత్​రావు ప్లాన్​ చేశాడని అధికారులు గుర్తించారు. ప్రణీత్​రావు పై ఐపీసీ 409,427,201,120 (బి) పి.డి.పి.పి. ఐటీ యాక్ట్​ కింద కేసు నమోదైంది. అతడికి సహకరించిన అధికారులపైనా కేసులు ఫైల్​ అయ్యాయి.