సర్కారు ఆర్డర్‌‌‌‌ ఇచ్చి ఏడాదైనా పట్టించుకోని వనపర్తి ఆఫీసర్లు

సర్కారు ఆర్డర్‌‌‌‌ ఇచ్చి ఏడాదైనా పట్టించుకోని వనపర్తి ఆఫీసర్లు

వనపర్తి టౌన్, వెలుగు:దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్న చందంగా ఉంది వనపర్తి విద్యాశాఖ అధికారుల తీరు. స్టేట్ ఆఫీసర్లు ఆర్డరిచ్చి ఏడాది దాటినా కొత్త కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఉమ్మడి పాలమూరులోని మిగతా నాలుగు జిల్లాల్లో  ఇదివరకే ఈ పోస్టుల నియామకం పూర్తయ్యింది. వనపర్తి జిల్లాలో పెండింగ్‌‌‌‌లో పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. అమ్ముకునేందుకే ఆలస్యం చేస్తున్నరంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, అరకొర సిబ్బందితో స్టూడెంట్లు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2018లో కొత్త కేజీబీవీల ఏర్పాటు 
వనపర్తి జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటుకు ముందు 10 కేజీబీవీలు ఉండేవి.  కొత్తమండలాల  అనంతరం మరో 5 కేజీబీవీలను ఏర్పాటు చేశారు.  శ్రీరంగాపూర్, రేవల్లీ, చిన్నంబావి, అమరచింత, మదనాపురంలో 2017–18 అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో 80 మంది స్టూడెంట్లతో 6, 7వ తరగతులు ప్రారంభించారు.   టీచింగ్ స్టాప్‌‌‌‌ను పూర్తిగా, నాన్‌‌‌‌టీచింగ్‌‌‌‌ స్టాప్‌‌‌‌ను  50శాతం మాత్రమే నియమించారు. ఆ తర్వాత 2020–21 నాటికి పదోతరగతికి అప్ గ్రేడ్ కావడంతో ఒక్కో కేజీబీవీలో 200కి పైగా స్టూడెంట్లు అడ్మిషనన్లు తీసుకున్నారు.  స్టూడెంట్లు పెరగడంతో నాన్ టీచింగ్ స్టాప్‌‌‌‌పై ఒత్తిడి పెరిగింది. భోజనం, వసతి, క్లీనింగ్ తదితర సదుపాయాల విషయంలో ఇబ్బంది అవుతుండడంతో ప్రభుత్వం  2021 ఏప్రిల్ 12  నాన్ టీచింగ్ స్టాప్ ను నియమించుకోవాలని అన్ని జిల్లాల డీఈవోలకు ఆర్డర్(ఆర్‌‌‌‌‌‌‌‌సీ నెం. 2821/ ఎస్ఎస్ఏ/ టీజీ/ కేజీబీవీ/ 2021)  జారీ చేసింది. దీని ప్రకారం కొత్త కేజీబీవీల్లో అకౌంటెంట్ 5, ఏఎన్ఎం 5, వాచ్ విమెన్ 4, స్వీపర్స్ 5, హెడ్ కుక్ 5, అసిస్టెంట్ కుక్ 5 చొప్పున మొత్తం 29 పోస్టులను భర్తీ చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది.  ఈ ఆదేశాల ప్రకారం మహబూబ్ నగర్,  గద్వాల, నారాయణ పేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో  ఉద్యోగాలు భర్తీ చేశారు.  వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం లైట్ తీసుకున్నారు. 

10 పోస్టులకు నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చినా.. 
ఏడాది క్రితం అప్పటి డీఈవో సుశీందర్ రావు ఏఎన్ఎం 5, అకౌంటెంట్ 5 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. వచ్చిన అప్లికేషన్లలో త్రిమెన్ కమిటీ ద్వారా మెరిట్‌‌‌‌ ప్రాతిపదికన 10 ఉద్యోగాలకు సెలెక్షన్ పూర్తి చేశారు. కాని కరోనా ఎఫెక్ట్‌‌‌‌తో వీరి నియామకం ఆగిపోయింది.  ఈ క్రమంలో డీఈవో బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఉన్న డీఈవో రవీందర్ ఈ ఉద్యోగాల ఫైల్‌‌‌‌ను అటకెక్కించారు. తమకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని ఎంపికైన పది మంది అభ్యర్థులు డీఈవో ఆఫీస్‌‌‌‌ చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా కనికరించడం లేదు. ఈ 10 ఉద్యోగాలతో పాటు మరో 19 నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తున్నారు. 

ఆలస్యం.. అమ్ముకునేందుకేనా...?
ఇతర జిల్లాల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసినా వనపర్తి ఆఫీసర్లతో కదలిక లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.  ఇప్పటికే అక్రమాలకు కేరాఫ్‌‌‌‌గా మారిన డీఈవో కార్యాలయ ఆఫీసర్లు పోస్టులను అమ్ముకునేందుకే ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు వినిస్తున్నాయి.  తమకు కావాల్సిన వ్యక్తులతో బేరసారాలు కుదుర్చుకున్న తర్వాత మొక్కుబడిగా నోటిఫికేషన్ జారీ చేస్తారేమోనని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఏడాది క్రితమే సెలెక్ట్‌‌‌‌ అయిన వారికి పోస్టింగ్‌‌‌‌ ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు.  ఈ విషయంపై డీఈవో రవీందర్‌‌‌‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించకుండా ఫోన్ స్విచ్చాఫ్‌‌‌‌ చేసుకున్నారు.

కేజీబీవీల్లో ఇబ్బందులు నిజమే
వనపర్తి జిల్లాలో కొత్త కేజీబీవీలతో పాటు పాత కేజీబీవీల్లో మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ముఖ్యంగా ఏఎన్ఎంలు లేకపోవడంతో స్టూడెంట్ల హెల్త్ విషయంలో చాలా అవస్థలు పడుతున్నాం. కుకింగ్, స్వీపర్లు, ఇతర నాన్ టీచింగ్ స్టాప్ లేకపోవడంతో భోజనం ఆలస్యం కావడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం.  కేజీబీవీల్లో ఖాళీలను భర్తీ చేయాలని  కలెక్టర్ అనుమతి కోసం ఫైల్ సిద్ధం చేసి చాలా రోజులు అయ్యింది.  ఉద్యోగాల భర్తీ విషయం డీఈవో పరిధిలో ఉంటుంది.
–శుభలక్ష్మి, జీసీడీవో, వనపర్తి