టీయూ హాస్టల్​లో .. తిండి లేక విద్యార్థుల భిక్షాటన

టీయూ హాస్టల్​లో .. తిండి లేక విద్యార్థుల భిక్షాటన
  • జీతాలు రాక నాన్​ టీచింగ్​ స్టాఫ్​ ఆందోళనతో ఫుడ్​ బంద్​
  • బయటి నుంచి తెప్పిస్తున్న చీఫ్ ​వార్డెన్​

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. జీతాలు లేక నాన్​టీచింగ్​స్టాఫ్​ఆందోళనకు దిగడంతో తినడానికి తిండి లేక విద్యార్థులు అడుక్కోవలసి వస్తున్నది. హాస్టల్​లో భోజనం వండకపోవడంతో విద్యార్థులు సమీప గ్రామంలోకి వెళ్లి భిక్షాటన చేసి ఆకలి తీర్చుకుంటున్నారు. వీసీ రవీందర్​గుప్తా, ఈసీకి మధ్య పడకపోవడంతో వర్సిటీలో పాలన గాడి తప్పింది. 

చెరో రిజిస్ట్రార్​ను నియమించడం, ఈసీ తీర్మానాలపై వీసీ హైకోర్టు కు వెళ్లడంతో వర్సిటీకి సంబంధించిన ఆర్థిక లావాదేవిలన్నీ నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. దీంతో జీతాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ 12వ తేదీ నుంచి ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హాస్టల్​లో మెస్​ వర్కర్లు కూడా డ్యూటీకు రాకపోవడంతో స్టూడెంట్స్​ ఆకలితో అలమటిస్తున్నారు.  

సమయానికి అందని భోజనం
మెస్​వర్కర్లు వంటచేయకపోవడంతో చీఫ్​వార్డెన్​క్యాటరింగ్ ​నుంచి టిఫిన్లు, భోజనాలు తెప్పిస్తున్నారు. అవి కూడా సమయానికి అందడం లేదు. దీంతో స్టూడెంట్స్​గురువారం వర్సిటీ మెయిన్​గేట్​దగ్గర ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భోజనం రాకపోవడంతో సుమారు 30 మంది విద్యార్థులు పక్కనే ఉన్న నడిపల్లి తండాకు వెళ్లి అడుక్కుని తిన్నారు. ఇది తెలుసుకున్న అధికారులు క్యాటరింగ్​నుంచి సాయంత్రం 5.30 గంటలకు భోజనం తెప్పించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.