అభివృద్ధి పథంలో నార్త్ ఈస్ట్ : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

అభివృద్ధి పథంలో నార్త్ ఈస్ట్ : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్​లో బీజేపీ మరోసారి జయకేతనం ఎగురవేసింది. మేఘాలయలోనూ క్రితం కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా కనెక్టివిటీ పెంచడంతోపాటు, మౌలిక వసతుల కల్పనకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నది. అందుకే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు నరేంద్ర మోడీని కోరుకుంటున్నారు. నార్త్​ఈస్ట్​ ముఖచిత్రాన్ని మారుస్తున్న రైల్వే లైన్లు, వంతెనల నిర్మాణం గురించి చర్చించాల్సిన సందర్భం ఇంతకన్నా మరేముంటుంది!

డి బ్రూ-–సాదియా మధ్య తొలి రైలుమార్గం1882లో సుదూర తేయాకు తోటలను బ్రహ్మపుత్రతో అనుసంధానించింది. తద్వారా ఆ తోటల నుంచి తేయాకు కోల్‌‌‌‌కతా నగర మార్కెట్​కు చేరింది. ఆనాడు డిబ్రూగఢ్ నుంచి కోల్‌‌‌‌కతా వెళ్లాలంటే15 రోజులు పట్టేది. అయితే, కాలక్రమంలో ఆ సమయాన్ని 24 గంటలకు తగ్గించడంలో రైల్వేలు ఎంతో కృషి చేశాయి. కానీ, 2014 దాకా ఈశాన్య ప్రాంతంలో రైలు మార్గాలు ప్రధానంగా ప్రస్తుత అస్సాం ప్రాంతానికి మాత్రమే పరిమితంగా ఉండేవి. గత 8 ఏండ్లలో ఈశాన్య ప్రాంతంలో రైల్వేల విస్తరణకు విశేష కృషి జరిగింది. ఉపరితల రవాణాలో పురోగమన వేగం ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పరుగులెత్తడానికి కీలకం. ఈ మేరకు భారతీయ రైల్వేలు ఈశాన్య ప్రాంత ప్రగతిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని, వెనుకబాటుతనాన్ని ఈ ప్రాంతం అధిగమించే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. భారతీయ రైల్వే గత 9 ఏండ్లలో ఈ ప్రాంతమంతటా కొత్త రైలుమార్గాలు, వంతెనలు, సొరంగాలు తదితరాల నిర్మాణానికి రూ.50 వేల కోట్లకుపైగా వెచ్చించింది. మరో రూ.80 వేల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కలిపే అనుసంధాన పథక లక్ష్యం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన141 మీటర్ల స్తంభాల వంతెనతో జిరిబామ్ –- ఇంఫాల్ రైలు మార్గాన్ని భారత్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయూతనిస్తూ వనరులను సమకూరుస్తోంది. ఆ మేరకు 2009–-14 మధ్య ఏటా రూ.2,122 కోట్ల వ్యయంతో పోల్చితే, సగటు వార్షిక బడ్జెట్ కేటాయింపులో ఇప్పుడు 370 శాతం పెరుగుదల ఉంది. 2022–-23 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ.9,970 కోట్లకు చేరింది. ఈశాన్య  ప్రాంతం భౌగోళిక స్వరూపం మౌలిక సౌలతుల అభివృద్ధికి కఠిన సవాళ్లు విసిరేలా ఉంటుంది. అయినా, బలమైన రాజకీయ సంకల్పం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఇక్కడ ప్రాంతాల మధ్య దూరం తగ్గుతున్నది. ప్రస్తుతం121 కొత్త సొరంగాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో దేశంలోనే అత్యంత పొడవైన10.28 కిలోమీటర్ల సొరంగం నం.12 ఒకటి కావడం గమనార్హం.

భూకంపాలను తట్టుకునే వంతెనలు

ఈశాన్య ప్రాంతంలో భారత రైల్వే తన నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ విస్తరణ కోసం ఆధునిక, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఆసియాలోనే  రెండో పొడవైన ‘బోగీ బీల్’ రైలు -రోడ్డు వంతెన 2018లో ప్రారంభమైంది. ఇది అస్సాం-– అరుణాచల్ మధ్య ప్రయాణ దూరాన్ని 80 శాతం తగ్గించింది. భారత రక్షణ దళాలకు రవాణా సదుపాయం కల్పిస్తున్నది. రిక్టర్ స్కేల్‌‌‌‌పై 7.0 తీవ్రతతో సంభవించే భూకంపాలను కూడా తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది. దీనిపై యుద్ధ విమానాలను కూడా దింపవచ్చు. సువిశాలమైన బ్రహ్మపుత్ర నది, గంభీర హిమాలయాలు సంప్రదాయకంగా ఈశాన్య భారతంలోని ప్రతి పౌరుణ్నీ ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలోని వివిధ మార్గాలకు బాటలు వేయడం ద్వారా రైల్వేశాఖ కూడా ఈ రెండింటి సరసన చోటు సంపాదించింది. ఈ నేపథ్యంలో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో ఈశాన్య ప్రాంతంలో వృద్ధి, ప్రగతి నేడు తమ వంతు పాత్ర పోషిస్తాయి. భారతదేశం సుసంపన్నం కావాలంటే ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ దిశగా ఆర్థికవృద్ధి సాధనలో రైల్వేల పాత్ర కచ్చితంగా కీలకమని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక తొమ్మిదేళ్ల తర్వాత ప్రధాని దార్శనికత ఈశాన్య ప్రాంతంలోని వాస్తవికతగా రూపాంతరం చెందగా, రైలు మార్గాలు ఈ పరివర్తన పయనంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

చరిత్రలో నిలిచే రైలు మార్గాలు

భారత్ – -బంగ్లాదేశ్ మధ్య రూ.1,100 కోట్లకుపైగా వ్యయంతో నిర్మిస్తున్న అగర్తల –అఖౌరా రైల్వే లింక్  ఓ మైలురాయిలా నిలిచిపోనుంది. ఇది తూర్పున గల పొరుగు దేశాలతో చారిత్రక రైలు సంబంధాలను ఏర్పరచడమేగాక ఈ ప్రాంతంలో ప్రగతి, -సౌభాగ్యాల కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ(డోనర్), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయి. ఇంఫాల్ రైల్వే మార్గం ‘మోరే’ దాకా పొడిగించబడుతున్నది.  అక్కడి నుంచి ‘కలే’ వద్ద మయన్మార్ రైల్వేలకు అనుసంధానితమై ఆసియా వ్యాప్త రైల్వేగా ఏర్పడుతుంది. మరోవైపు జాతీయ భద్రత కోసం ఈ ప్రాంత భౌగోళిక- వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ అస్సాం- – అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌లను కలిపే రైలు – -రోడ్డు కారిడార్‌‌‌‌ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా భారతదేశంలోనే తొలి జలాంతర రైలు మార్గ సొరంగం నిర్మితం కానుంది. ఈ రైలు -రహదారి అనుసంధానంతో భారత్ -ఈశాన్య సరిహద్దుల దాకా సంధానాన్ని ఖరారు చేస్తుంది. తద్వారా జాతీయ భద్రత సమస్యలపై ప్రతిస్పందిస్తూ- వేగంగా చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. 2017లో ఉత్తర అస్సాం – -తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌లను కలిపే కీలక వ్యూహాత్మక ధోలా – -సాదియా వంతెనపై వాహన రాకపోకలు మొదలయ్యాయి. ఇది భారతదేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెన మాత్రమేగాక మన యుద్ధ ట్యాంకుల బరువును సులువుగా మోయగలదు. దేశ ఈశాన్య సరిహద్దులకు దళాలను త్వరగా తరలించే వీలు కల్పిస్తుంది.

ఉపాధి అవకాశాలు

స్థానిక వ్యాపారాలను, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే కృషిలో భాగంగా ఈశాన్య సరిహద్దు రైల్వే 2022లో అస్సాం-–గోవాల మధ్య తొలి పార్సిల్ కార్గో ఎక్స్‌‌‌‌ ప్రెస్ రైలును నడిపింది. ఈశాన్య రాష్ట్రాలను సందర్శించే వారు ఈ ప్రాంతంలోని అద్భుత పర్యాటక సామర్థ్యాన్ని తప్పక గుర్తిస్తారు. అడుగడుగునా ఆకర్షణీయ దృశ్యాలు, వన్యప్రాణులు, ఇక్కడి సంస్కృతీ, -పండుగల రూపంలో అంతర్లీనంగా కనిపించే వారసత్వం ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈశాన్య సరిహద్దు రైల్వే విభాగం అనేక అత్యాధునిక విస్టా డోమ్ కోచ్‌‌‌‌లను ప్రవేశపెట్టింది. తద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగి, అక్కడి మహిళలు, గిరిజనులు తదితర వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 20 వేలకుపైగా అన్​స్కిల్డ్​కార్మికులను రైల్వే నియమించింది. అదే సమయంలో స్కిల్డ్​లేబర్స్​కు అవకాశాలు పెరిగాయి. గత 9 ఏండ్లలో ఈ ప్రాంత సంస్కృతి, గుర్తింపును సంరక్షించడంతోపాటు భవిష్యత్తరాలకు అందించేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో బతుకుదెరువు కోసం వారు వలసబాట పట్టాల్సిన దుస్థితి తప్పింది. సామాజికంగా, ఆర్థికంగా సాధికారత సాధించే యువతరం ఈ ప్రాంతానికేగాక దేశానికే విలువైన సంపద.

- జి. కిషన్​రెడ్డి, కేంద్ర పర్యాటక,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి