మా జోలికొస్తే.. తీవ్ర పరిణామాలుంటయ్

మా జోలికొస్తే.. తీవ్ర పరిణామాలుంటయ్
  • యూఎన్​ భద్రతా మండలికి నార్త్ కొరియా వార్నింగ్

సియోల్: న్యూక్లియర్ మిసైల్స్ ప్రయోగం విషయంలో తమపై యూఎన్​ భద్రతా మండలి ఆంక్షలు విధించడంపై నార్త్ కొరియా మండిపడింది. తమ సావరీనిటీకి భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. నార్త్ కొరియా ఆరునెలల తర్వాత ఇటీవల మళ్లీ న్యూక్లియర్ మిసైళ్లను పరీక్షించింది. ఈ క్రమంలో శుక్రవారం సమావేశమైన భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. బాలిస్టిక్ మిసైల్స్ పరీక్షలు జరిపిన నార్త్ కొరియాపై భద్రతా మండలి ఆంక్షలను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ ఫ్రాన్స్ ఈ సమావేశంలో ఒక ప్రకటనను ప్రవేశపెట్టింది. అయితే భద్రతా మండలి డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందంటూ ఆదివారం నార్త్ కొరియా ఫారిన్ మినిస్ట్రీ అధికారి జో చోల్ సూ ఆరోపించారు. ‘‘నార్త్ కొరియా సావరినీటీకి భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో భద్రతా మండలి ఆలోచించి ఉంటే బాగుండేది” అని హెచ్చరించారు. అమెరికా, దాని మిత్ర దేశాలు (సౌత్ కొరియా, జపాన్) కూడా న్యూక్లియర్ మిసైల్స్ ను పరీక్షిస్తున్నాయని, కానీ భద్రతా మండలి అన్ని దేశాలను సమానంగా ఎందుకు చూడటంలేదని ప్రశ్నించారు. నార్త్ కొరియా బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగాలపై భద్రతా మండలి గతంలోనే నిషేధం విధించింది.