సియోల్: నార్త్ కొరియా అణ్వాయుధ దేశమని, తాము న్యూక్లియర్ వెపన్స్‌ను ఎన్నటికీ వదులుకోబోమని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అణ్వాయుధాలు తమ దేశ డిగ్నిటీకి, పవర్‌కు ప్రతీకలని స్పష్టంచేశారు. ‘‘ఈ భూమిపై అణ్వాయుధాలు ఉన్నంతవరకూ, అమెరికా, దాని మిత్ర దేశాలు యాంటీ నార్త్ కొరియా వైఖరిని మానేవరకూ.. మా న్యూక్లియర్ ఫోర్స్‌ను శక్తిమంతం చేసుకునే ప్రక్రియ ముగిసిపోదు” అని కిమ్ జోంగ్ తేల్చిచెప్పారు. నార్త్ కొరియాను న్యూక్లియర్ వెపన్స్ కంట్రీగా ప్రకటిస్తూ ప్రవేశపెట్టిన చట్టాన్ని ఆ దేశ పార్లమెంట్‌గా చెప్పుకొనే సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
చట్టాన్ని కూడా తెచ్చినందున ఇక తమ దేశాన్ని అణ్వాయుధ రహిత దేశంగా మార్చేందుకు చాన్సే లేదని కిమ్ జోంగ్ అన్నారు. అణ్వాయుధాలను వదులుకొనే విషయంపై ఇక ఎలాంటి చర్చలు, బేరసారాలు ఉండబోవన్నారు. అణ్వాయుధాల ప్రయోగం విషయంలోనూ నార్త్ కొరియా స్టాండ్ మారినట్లు శుక్రవారం నార్త్ కొరియన్ మీడియా వెల్లడించింది. అణ్వాయుధాలులేని దేశాల మీదకు వాటిని ముందస్తుగా ప్రయోగించబోమని చెప్పింది. అయితే, కొత్త చట్టంలో మార్పుల ప్రకారం.. ఇకపై తనను తాను రక్షించుకునేందుకు ఏ దేశంపై అయినా ముందస్తుగా అణ్వాయుధాలతో నార్త్ కొరియా దాడి చేయొచ్చని పేర్కొన్నారు.
